కలం, ఆదిలాబాద్: అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలను పారదర్శకంగా అందించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ (Mohammed Ali Shabbir) స్పష్టం చేశారు. గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని గాయత్రి గార్డెన్‌లో నిర్వహించిన రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగా కళ్ల అద్దాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు మాట్లాడుతూ… జిల్లా వ్యాప్తంగా రెండో విడతలో భాగంగా 750 మంది లబ్ధిదారులకు రూ. 5 లక్షల చొప్పున ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేస్తున్నట్లు తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 6 వేలకు పైగా ఇళ్లు మంజూరయ్యాయని, అర్హత ఉండి ఏ ఒక్కరికీ పథకం మిస్సయినా, తక్షణమే పరిశీలించి మంజూరు పత్రం అందజేస్తామని మహమ్మద్ అలీ షబ్బీర్ భరోసానిచ్చారు. ఇందిరమ్మ ఇళ్లతో పాటు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి అనేక సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందజేస్తున్నామని ఆయన (Mohammed Ali Shabbir) వెల్లడించారు. ప్రజాపాలన దినోత్సవ వేడుకలలో భాగంగా రెండవ విడత ఇందిరమ్మ ఇళ్లు సైతం మంజుయ్యాయని, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక పాలనకు నిదర్శనమన్నారు.
ఆదిలాబాదు జిల్లా విమానాశ్రయం నిర్మాణంతో జిల్లా రూపురేఖలు మారనున్నాయని, జిల్లా మరింత ఆర్థిక అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల శంకర్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్లు ఆర్.ఎస్.చిత్రు, ఎస్.రాజేశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూషా, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, సబ్ కలెక్టర్ ప్రణయ్ కుమార్, పిడి హౌసింగ్ శంకర్, ఆర్డీఓ జగదీశ్వర్ రావు, డీఈఓ మాధవి, ఆత్మ చైర్మన్ సంతోష్, మున్సిపల్ వైస్ చైర్మన్ రోహిత్, వివిధ శాఖల అధికారులు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

