కలం, జగిత్యాల: ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించి గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దే దిశగా అనంతారం గ్రామపంచాయతీ (Anantharam Gram Panchayat) పాలకవర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. జగిత్యాల రూరల్ మండలం అనంతారం గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం గ్రామ సర్పంచ్ బత్తిని రవీణ మహేష్ ఆధ్వర్యంలో వేతనంతో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బత్తిని రవీణ మహేష్ మాట్లాడుతూ.. గ్రామంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిస్థాయిలో తగ్గించేందుకు ప్రజలు, వ్యాపారులు సహకరించాలని వారు కోరారు. శుభకార్యాలు, ఇతర కార్యక్రమాల్లో ప్లాస్టిక్ ప్లేట్ల వినియోగాన్ని తగ్గించేందుకు స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవసరమైన వారు స్టీల్ సామగ్రిని వినియోగించుకోవడం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించవచ్చన్నారు.
అదేవిధంగా గ్రామంలో ప్లాస్టిక్ నియంత్రణలో భాగంగా పలు నిర్ణయాలు తీసుకున్నట్లు సర్పంచ్ తెలిపారు. శుభకార్యాలు, కిరాణా దుకాణాల్లో బఫే ప్లేట్లను అమ్మడం, వినియోగించడం నిషేధించినట్లు పేర్కొన్నారు. చికెన్ సెంటర్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లను ఉపయోగించరాదని వారు సూచించారు. బిర్యానీ, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో కూడా ప్లాస్టిక్ కవర్లపై ఆహార పదార్థాలను పెట్టకుండా ప్రత్యామ్నాయాలను వినియోగించాలని తెలిపారు. ప్రతి దుకాణంలో తప్పనిసరిగా డస్ట్‌బిన్ ఏర్పాటు చేసుకోవాలని, దుకాణాల్లో ఉత్పత్తి అయ్యే చెత్తను రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో పడేయకుండా గ్రామపంచాయతీ చెత్త సేకరణ వాహనం వచ్చినప్పుడు అందజేయాలని సూచించారు. గ్రామ పరిశుభ్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
పంచాయతీ తీసుకున్న నిర్ణయాలను ఎవరైనా ఉల్లంఘిస్తే రూ.5,000 జరిమానా విధించనున్నట్లు సర్పంచ్ స్పష్టం చేశారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి కలిగే నష్టాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. గ్రామాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో, ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలని సర్పంచ్ బత్తిని రవీణ మహేష్ పిలుపునిచ్చారు. “ప్లాస్టిక్‌ను తగ్గిద్దాం.. అనంతారం గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుదాం” అనే నినాదంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గం, వీడీసీ సభ్యులు, గ్రామ నాయకులు, గ్రామ యువత, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

