కలం, కనగల్ : గ్రామస్థాయి నుంచే పిల్లలకు ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్పించడం, వారిలో దాగి ఉన్న నాయకత్వ లక్షణాలను వెలికితీయడమే లక్ష్యంగా నల్లగొండ జిల్లా కనగల్ మండలం చెర్లగౌరారం గ్రామంలో నిర్వహించిన ‘బాల పంచాయత్’ (Bala Panchayat) కార్యక్రమం ఘనంగా ముగిసింది. జిల్లా పోలీస్ శాఖ, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆదేశానుసారం యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ బృందం ఆధ్వర్యంలో ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి టీజీపీఏ డైరెక్టర్ అభిలాషా బిష్త్, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా అభిలాషా బిష్త్ మాట్లాడుతూ.. “పిల్లల హక్కులు, వారి భవిష్యత్ నిర్మాణం సమాజానికి అత్యంత ముఖ్యం. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు సమయం కేటాయించి, వారి ఆలోచనలను ప్రోత్సహించాలి. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి సరైన దిశలో మార్గనిర్దేశం చేస్తే భవిష్యత్తులో వారు సమాజానికి ఉపయోగపడే అద్భుతమైన నాయకులుగా ఎదుగుతారు. సమాజంలో మార్పు రావాలంటే ముందుగా ప్రతి ఒక్కరూ తమలో మార్పు తెచ్చుకోవాలి. చిన్నారులు తమ అభిప్రాయాలను ఎల్లప్పుడూ ధైర్యంగా వ్యక్తపరచాలి. పిల్లలే మన భవిష్యత్తు. వారికి సమయం ఇవ్వండి, వారి ఆలోచనలను వినండి, ప్రోత్సహించండి”అని పేర్కొన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. “గ్రామస్థాయి నుంచే పిల్లలకు ఇటువంటి నాయకత్వ అవకాశాలు కల్పించడం ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురాగలము. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా తమ హక్కులు, బాధ్యతలపై సామాజిక అవగాహన పెంపొందించుకోవాలి” అని తెలిపారు. ఈ చారిత్రాత్మక బాల పంచాయత్ కార్యక్రమంలో ఏఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, ఎంపీడీఓ వేద రక్షిత, సీఐలు ఆది రెడ్డి, రాము, కరుణాకర్, ఎస్సైలు అంజలి, రాజీవ్ రెడ్డి, డీడబ్ల్యూఓ కృష్ణవేణి, డీఈఓ సుశీందర్ రావు, సీడబ్ల్యూసీ చైర్మన్ కృష్ణయ్య, చెర్లగౌరారం సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది, యువత, మహిళా సంఘాల ప్రతినిధులు, 300 మందికి పైగా గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.

