కలం, వెబ్‌డెస్క్: కొద్ది రోజుల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి (TTD) ఓ భక్తుడు 121 కేజీల బంగారం కానుకగా ఇవ్వబోతున్నాడన్న వార్త దేశ వ్యాప్తంగా మారుమోగి పోయింది. ఈ బంగారం విలువ అక్షరాలా రూ.160 కోట్ల వరకు ఉంటుంది. దీంతో అంత పెద్ద మొత్తంలో అందిస్తున్న వ్యక్తి ఎవరా? అని భక్తులు, నెటిజన్లు, ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. మొదట్లో పలు కారణాల దృష్ట్యా ఆ వ్యక్తి వివరాలు బయటకు చెప్పరని కూడా ప్రచారం జరిగింది. కానీ, ఎట్టకేలకు ఈ రోజు ఆ సస్పెన్స్‌కు తెరపడింది. చెన్నైకి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త వర్ధమాన్ జైన్ (Vardhaman Jain) ఈ భారీ విరాళాన్ని అందించారు. యాక్సెస్ హెల్త్ కేర్ సంస్థ సహ వ్యవస్థాపకుడైన వర్ధమాన్ నేడు కుటుంబ సమేతంగా తిరుమలను దర్శించి, సీఎం చంద్రబాబు, టీటీడీ ఈవో రవిచంద్ర, ఇతర అధికారుల సమక్షంలో ఈ బంగారాన్ని అందించారు.
వర్ధమాన్ జైన్ సమర్పించిన ఈ ఆభరణాల్లో మూలవిరాట్టుకు నిత్యాలంకరణలో ఉపయోగించే కిరీటం నుంచి పద్మపీఠం వరకు మొత్తం 46 రకాల ఆభరణాలు ఉన్నాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు వర్ధమాన్ జైన్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆనంద నిలయంలో అర్చకులు సీఎంకు పట్టువస్త్రం కప్పి ఆశీర్వదించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో నాలుగు ప్రత్యేక అరల్లో ఏర్పాటు చేసిన బంగారు ఆభరణాలను సీఎం , టీటీడీ అధికారులు చూశారు. స్వామి వారికి ఇంతటి భారీ కానుకను స్వయంగా సమర్పించడం ఎంతో ఆనందాన్నిచ్చిందని దాత పేర్కొన్నారు.
లయోలా కాలేజీలో చదువు పూర్తి చేసిన వర్ధమాన్ జైన్, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. ప్రపంచ స్థాయిలో వ్యాపార రంగంలో తనదైన గుర్తింపు సంపాదించారు. దీంతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. కంచి కామకోటి చైల్డ్స్ ట్రస్ట్ ఆసుపత్రికి మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. నిరుపేద పిల్లలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారు. 2025లో వర్ధమాన్ జైన్ (Vardhaman Jain) యాక్సిస్ హెల్త్ కంపెనీలో 70 శాతం వాటాను అమెరికా సంస్థకు సుమారు 2 బిలియన్ డాలర్ల విలువైన డీల్‌కు విక్రియించారని ప్రచారం జరుగుతోంది. ఈ డబ్బు విలువ రూపాయల్లో అక్షరాలా రూ.18,516.39 కోట్లు ఉంటుంది. ఈ డబ్బులో కొంత భాగంతోనే వర్ధమాన్ స్వామి వారికి ఆభరణాలు చేయించినట్లు సమాచారం. గతంలోనూ వర్ధమాన్ టీటీడీకి భారీ విరాళాలు అందించారు. ఎలక్ట్రిక్ బస్సులు, కాయిన్ సార్టింగ్ మిషిన్, ఎస్వీబీసీ, గోసంరక్షణ శాలకు విరాళాలు అందించారు.
Also Read : అరుదైన శస్త్రచికిత్స.. బాలుడి శరీరంలో గర్భాశయం తొలగింపు
Follow Us On: Youtube

