కుల గణనపై సుప్రీం తీర్పు.. టీపీసీసీ చీఫ్‌ ఏమన్నారంటే!

కలం, నిజామాబాద్ బ్యూరో : జనగణన ప్రక్రియలో కుల గణన కూడా చేపట్టాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై టీపీసీసీ అధ్యక్షులు (TPCC Chief) ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని సామాజిక, ఆర్థిక అసమానతలను సరిచేయడానికి కుల గణన అత్యంత అవసరమని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా దేశవ్యాప్తంగా కుల గణన అవసరాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారని, సామాజిక న్యాయం సాధనకు కుల గణన కీలకమని స్పష్టం చేశారని పేర్కొన్నారు.

వెనుకబడిన వర్గాలకు వారి జనాభా ప్రాతిపదికన న్యాయం జరగాలంటే సమగ్ర కుల గణన తప్పనిసరి అని కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతోందని పేర్కొన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, మంత్రులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో చేపట్టిన కుల సర్వే విజయవంతమైందని మహేష్ కుమార్ గౌడ్ గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా, శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించిన ఈ సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పుకొచ్చారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, సంక్షేమ ఫలాల సరైన పంపిణీ కోసం కుల గణన ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో చేపట్టిన కుల సర్వే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా సమగ్ర కుల గణన నిర్వహించాలని టీపీసీసీ అధ్యక్షులు డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>