కలం, వెబ్ డెస్క్ : తిరుపతి నగర పరిధిలో చెడ్డీ గ్యాంగ్ (Cheddi Gang) సంచారం కలకలం రేపింది. తిరుచానూరు (tiruchanur) పంచాయతీ పరిధిలోని కొత్తపాలెం ప్రాంతంలో బుధవారం అర్థరాత్రి అనుమానాస్పదంగా కొందరు వ్యక్తులు సంచరించిన దృశ్యాలు స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైనట్లు సమాచారం. దీంతో పోలీసులు అప్రమత్తమై రాత్రివేళల్లో గస్తీని ముమ్మరం చేశారు.
సీసీ కెమెరాలపై పోలీసుల నిఘా
కొత్తపాలెం ప్రాంతంలో అర్థరాత్రి సమయంలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించిన స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, ఎటువైపు వెళ్లారనే అంశాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఆయా ప్రాంతాల్లో రాత్రి వేళల్లో పోలీసులు పెట్రోలింగ్‌ను పెంచారు. ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. విలువైన వస్తువులు, నగదు విషయంలో జాగ్రత్తలు పాటించాలని, అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు కోరుతున్నారు.
ధర్మవరంలోనూ చోరీకి యత్నం
ఇదిలా ఉండగా గత నెల 28న అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోనూ చెడ్డీ గ్యాంగ్‌కు చెందిన వ్యక్తులు నాలుగు ఇళ్లలో చోరీ చేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతిలో తాజా కదలికలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా అనుమానితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

