కలం, వెబ్ డెస్క్: ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలో భుజానికి ఆపరేషన్ చేయించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను సీఎం చంద్రబాబు పరామర్శించారు. పవన్‌తో మాట్లాడి శస్త్ర చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను జనసేన పార్టీ విడుదల చేసింది. శనివారం సుమారు మూడున్నర గంటలపాటు ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్ దిన్షా పార్థీవాలా నేతృత్వంలో ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే.
రెండు భుజాల్లో బలమైన గాయాలు..
పదేళ్ల కిందటే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రెండు భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ కావడం ప్రారంభమైందని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజా సేవ, పార్టీ కార్యక్రమాల్లో భాగంగా ఆపరేషన్ చేయించుకోవడాన్ని పవన్ ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చారు. ఇటీవల నొప్పి బాగా పెరగడంతో ముంబైకి వెళ్లి పరీక్షలు చేయించుకోగా.. వెంటనే ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సిఫార్సు చేశారు. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల కిందట చేరగా.. విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తయింది.
రెండు నెలలు పట్టే అవకాశం..
ప్రస్తుతం ఒక భుజానికి మాత్రమే ఆపరేషన్ చేసినట్లు వైద్యులు వెల్లడించారు. కోలుకోవడానికి సుమారు రెండు నెలలు పట్టే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అనంతరమే మరో భుజానికి శస్త్ర చికిత్స నిర్వహించనున్నారు. కనీసం నెల రోజుల పాటు పవన్ కళ్యాణ్ అధికారిక విధులకు దూరంగా ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.
Read Also: నా ప్రశ్నించే స్వరం ఆగదు.. ప్రకాష్ రాజ్ ఫైర్
Follow Us On : WhatsApp

