కలం, వెబ్ డెస్క్ : మాజీ సీఎం జగన్ కు కనీస అవగాహన లేకుండా రాజధానిపై మాట్లాడుతున్నారంటూ చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు (Chandrababu) నాయుడు. సీఎం ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అంటున్నారు జగన్.. హైదరాబాద్ లో ఉన్నా, బెంగుళూరులో ఉన్నా అక్కడే రాజధాని అవుతుందా అంటూ విమర్శించారు సీఎం చంద్రబాబు. సీనియర్ ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని చాటిచెప్పింది ఎన్టీఆర్ అని.. దాన్ని తాము కొనసాగిస్తున్నట్టు తెలిపారు.
ఏపీకి ఇప్పుడు చాలా అభివృద్ధి జరుగుతోందని వివరించారు సీఎం చంద్రబాబు (Chandrababu). గత జగన్ పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని.. ఇప్పుడు తాము ప్రపంచస్థాయి కంపెనీలను తీసుకొస్తున్నట్టు వివరించారు. ‘జగన్ కు రాజధాని కట్టడం ఇష్టం లేదు. అందుకే అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని అంటూ అర్థంలేని మాటలు మాట్లాడుతున్నారు. మూడు రాజధానులు అంటూ జగన్ ఆడిన ఆటలను ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు మేం అమరావతిని వేగంగా అభివృద్ధి చేస్తున్నాం. త్వరలోనే మరిన్ని పెట్టుబడులు తీసుకొస్తాం‘ అంటూ చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు.


