అన‌కాప‌ల్లిని మ‌రో రంగారెడ్డి జిల్లాగా మారుస్తా: సీఎం చంద్ర‌బాబు

క‌లం, వెబ్ డెస్క్‌: ఏపీలోని అన‌కాప‌ల్లి (Anakapalli )జిల్లాను మ‌రో రంగారెడ్డి జిల్లాగా మారుస్తాన‌ని సీఎం చంద్ర‌బాబు (Chandrababu) అన్నారు. అన‌కాప‌ల్లి జిల్లాలోని రాంబిల్లిలో రెన్యూ ఎన‌ర్జీ ప్లాంట్‌కు సీఎం చంద్ర‌బాబు నేడు శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ఆయన మాట్లాడారు. గ‌తంలో హైద‌రాబాద్ చుట్టూ రంగారెడ్డి (Ranga Reddy) జిల్లా ఉండేద‌ని, ఆనాడు స‌మైఖ్యాంధ్రలోనే రంగారెడ్డి అత్యంత‌ వెనుక‌బ‌డిన జిల్లా అని చెప్పారు. ఇప్పుడు అదే రంగారెడ్డి జిల్లా దేశంలోనే అత్యంత ధ‌నిక జిల్లా అని వివ‌రించారు. ఇప్పుడు విశాఖప‌ట్నంలో మొత్తం ప‌రిశ్ర‌మ‌లు వ‌చ్చాయ‌ని, ఇక ఏమైనా పెట్టుబ‌డులు వ‌స్తే అన‌కాప‌ల్లి జిల్లాకే వ‌స్తాయ‌ని పేర్కొన్నారు. అన‌కాప‌ల్లిని మ‌రో రంగారెడ్డి జిల్లాగా మారుస్తాన‌ని సీఎం హామీ ఇచ్చారు.

మ‌రోవైపు ఏపీఎస్ఆర్టీసీపై సీఎం చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాబోయే రోజుల్లో అన్ని ఆర్టీసీ బ‌స్సులు ఎల‌క్ట్రిక్ బ‌స్సులే వ‌స్తాయ‌ని, అంద‌రూ స‌హ‌క‌రిస్తే ఆర్టీసీ బ‌స్సుల‌న్నీ ఏసీ బ‌స్సులుగా మార్చి పేద వాళ్లు కూడా ఏసీలో తిరిగేలా చేస్తామ‌న్నారు. పేద‌లు కూడా బ‌య‌ట‌కు వ‌స్తే గౌర‌వంగా ఉండాల‌న‌న్న‌దే త‌మ కోరిక అని సీఎం చెప్పారు. కాకినాడ‌లో గ్రీన్ అమ్మోనియా ఉత్ప‌త్తి కోసం సంస్థ ముందుకొచ్చింద‌ని సీఎం చెప్పారు. దీనికి సంబంధించిన ఒప్పందాలు కూడా పూర్త‌య్యాయ‌న్నారు. రాష్ట్రంలో ప్ర‌తి ఇంటిని విద్యుత్ ఉత్ప‌త్తి కేంద్రంగా చేయ‌ల‌న్న‌దే త‌న ఆలోచ‌న అని సీఎం చంద్ర‌బాబు అన్నారు. ఇంటికి అవ‌స‌ర‌మైన క‌రెంట్ వాడుకొని, అద‌నంగా ఉన్న క‌రెంట్‌ను గ్రిడ్‌కు ఇవ్వాల‌ని, మ‌ళ్లీ అవ‌స‌ర‌మైతే గ్రిడ్ నుంచి తీసుకోవాల‌ని చెప్పారు. వ్య‌వ‌సాయం చేసే రైతులు కూడా పంపుసెట్ ద‌గ్గ‌ర క‌రెంట్ ఉత్ప‌త్తి చేసుకోవాల‌ని సూచించారు.

జూలై మొద‌టి వారంలో ప్ర‌ధాని నరేంద్ర మోదీ (PM Modi) భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభిస్తార‌ని సీఎం చెప్పారు. పోర్టులు, ఎయిర్‌ పోర్టులు, హైవేలు పూర్తి చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు. రాష్ట్రంలో ఎన్నో ఇండ‌స్ట్రీలు వ‌స్తున్నాయ‌ని చెప్పారు. ఈ వ‌ర్షాకాలంలో వాన‌లు ప‌డ‌గానే గోదావ‌రి నీళ్ల‌ను ఉత్త‌రాంధ్ర సుజ‌ల స్ర‌వంతి ద్వారా ఈ ప్రాంతానికి తీసుకొస్తున్నామ‌న్నారు. స్థానికంగా ఫార్మా అభివృద్ధి చెందుతోంద‌న్నారు. మోదీ మ‌ద్ద‌తుతో విశాఖ ఉక్కును కాపాడిన‌ట్లు చెప్పారు. త్వ‌ర‌లో రైల్వే జోన్‌ ప్రారంభిస్తున్న‌ట్లు తెలిపారు. రెండు లైన్ల‌ను నాలుగు లైన్లుగా మార్చి, అక్క‌డి నుంచి ప్ర‌తి పోర్ట్‌కు క‌నెక్ట్ చేస్తామ‌ని చెప్పారు.

ఇక వైసీపీపై సీఎం చంద్ర‌బాబు (Chandrababu) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ బ్యాచ్ నేరాలు, ఘోరాల‌కు తెగ‌బ‌డుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. క‌డ‌ప‌లో ద‌స్త‌గిరి అనే వ్య‌క్తిని చంపేశార‌న్నారు. వివేకా హ‌త్య త‌ర‌హాలో మోసం చేయాల‌నుకున్నార‌ని ఆరోపించారు. వివేకా హ‌త్య జ‌రిగితే గుండె పోటు అని ప్ర‌చారం చేశార‌న్నారు. చివ‌రికి ఆయ‌న కూతురు విచార‌ణ చేయాల‌ని, పోస్టుమార్టం చేయాల‌ని చెప్పార‌ని గుర్తు చేశారు. అదే రోజు సాయంత్రానికి గుండెపోటు కాద‌ని, ఇది గొడ్డ‌లి పోటు అని డాక్ట‌ర్లు చెప్పార‌న్నారు. ఇక జ‌గ‌న్ గురించి చెప్తూ జ‌గ‌న్ తండ్రి లేడు.. ఉన్న చిన్నాన్న‌ని చంపేశార‌ని మాట మార్చాడ‌న్నారు. త‌ర్వాత రోజు త‌న చేతిలో క‌త్తి పెట్టి సానుభూతితో ఓట్లు సంపాదించాడ‌న్నారు. వైసీపీ కిల్ల‌ర్ పార్టీ అని, సొంత పార్టీ వాళ్ల‌నే చంపుకొని మ‌ళ్లీ న్యాయం కావాల‌ని అడుగుతార‌ని ఆరోపించారు. ప్ర‌జ‌లెవ‌రూ ఆ పార్టీని, పార్టీ నేత‌ల్ని న‌మ్మ‌వ‌ద్ద‌ని సూచించారు.

Read Also: ఏపీలో హనీ ట్రాప్.. వెలుగులోకి వస్తున్న సంచలన విషయాలు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>