‘పల్లె పండుగ 3.0’కు శ్రీకారం..రామాపురంలో చంద్రబాబు, పవన్ పర్యటన

కలం, వెబ్‌ డెస్క్‌ : ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని మరింత వేగవంతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్ఠాత్మక కార్యక్రమం పల్లె పండుగ 3.0 కు (Palle Panduga 3.0) ఈ నెల 29న శ్రీకారం చుట్టనున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం రామాపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ఈ నేపథ్యంలో రామాపురంలో (Ramapuram)సభా ప్రాంగణం, పార్కింగ్, భద్రత, తాగునీరు, విద్యుత్ తదితర ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

గ్రామీణాభివృద్ధికి భారీ నిధులు

పల్లె పండుగ 3.0 లో భాగంగా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.11,085 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇందులో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, మినీ గోకులాలు, వ్యవసాయ కుంటలు, మ్యాజిక్ డ్రెయిన్లు, బస్ షెల్టర్లు, గ్రామ పంచాయతీ భవనాలు తదితర పనులకు నిధులు కేటాయించారు.

పంచాయతీ స్థాయిలో అభివృద్ధి పనులకు అనుమతులు, గ్రాంట్లు అందించడంతో పాటు గ్రామీణ రహదారులు, తాగునీటి సౌకర్యాలను మెరుగుపరచడంపై దృష్టి సారించనున్నారు.

ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న అధికారులు

సీఎం, డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను వేగవంతం చేసింది. సభా వేదిక, ప్రాంగణం, వాహనాల పార్కింగ్, భద్రతా ఏర్పాట్లను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో అవసరమైన మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

విజయవంతం చేసేందుకు కూటమి నేతల సన్నాహాలు

పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు సమాయత్తమవుతున్నారు. ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు సమావేశాలు నిర్వహిస్తూ కార్యాచరణపై చర్చిస్తున్నారు. రామాపురం సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చేలా నాయకులు సమన్వయంతో పనిచేస్తున్నారు. కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మరింత ఊతం లభించనుందని కూటమి నేతలు పేర్కొంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>