కలం, కరీంనగర్ బ్యూరో: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని నంది పంప్ హౌస్ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్ మానేరు (Mid Manair Dam)కు గోదావరి జలాల ఎత్తిపోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 4 నుంచి 12 వరకు మోటార్లను నడిపించిన అధికారులు, అనంతరం మూడు రోజుల విరామం ఇచ్చారు. ఆ తర్వాత 15 నుంచి 24 వరకు కేవలం రెండు మోటార్ల ద్వారానే 6,300 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేశారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. ఈ నీరు వృధా కాకుండా ఎత్తిపోసి, ఎగువన ఉన్న ప్రాజెక్టులను నింపాలని ప్రతిపక్షాల ఒత్తిడితో స్పందించిన ప్రభుత్వం మోటార్ల సంఖ్యను పెంచాలని ఆదేశించింది. దీంతో ఈ నెల 25న మోటార్ల సంఖ్యను 2 నుంచి 4కు పెంచి 12,600 క్యూసెక్కుల నీటిని, 26న 5 మోటార్ల ద్వారా 15,750 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోశారు. తాజాగా ఆదివారం ఒక మోటారును నిలిపివేసి 1, 3, 6, 7 నంబర్ గల 4 మోటార్ల ద్వారా పంపింగ్ ప్రక్రియను చేపట్టారు.
నీటి ప్రవాహం సాగుతోందిలా..
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రోజుకు 12,600 క్యూసెక్కుల జలాలు గ్రావిటీ కాలువ ద్వారా ప్రవహించి, జంట సొరంగాల మార్గంలో నంది మేడారం పంప్ హౌస్ సర్జ్ పూల్‌కు చేరుకుంటున్నాయి. అక్కడ 4 మోటార్ల ద్వారా పంపింగ్ చేయడంతో నీరు డెలివరీ సిస్టర్న్ ద్వారా నంది రిజర్వాయర్‌లోకి చేరుతోంది.
అనంతరం రిజర్వాయర్ క్రస్ట్ గేట్ల ద్వారా అదే పరిమాణంలో నీరు జంట సొరంగాల మార్గంలో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ లోని గాయత్రి పంప్ హౌస్‌కు పారుతోంది. అక్కడ 4 బాహుబలి మోటార్లను ఆన్ చేసి నీటిని ఎత్తిపోస్తుండటంతో జలాలు వరద కాలువ ద్వారా మిడ్ మానేరుకు, అక్కడి నుంచి ఇతర అనుబంధ ప్రాజెక్టులకు చేరుకుంటున్నాయి.

