కలం, కరీంనగర్: కరీంనగర్‌లోని కోతిరాంపూర్‌లో నివాసముంటున్న రేకొండ వాస్తవ్యులు మండల వెంకట మల్లయ్య మృతి అత్యంత బాధాకరమని సిపిఐ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి (Chada Venkat Reddy) అన్నారు. బుధవారం కోతిరాంపూర్‌లో(Kothirampur) వెంకట మల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వెంకట మల్లయ్య భార్య, కుమారులు, కుమార్తెలను ఓదార్చారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. రేకొండ గ్రామానికి చెందిన వెంకట మల్లయ్య విద్యుత్ శాఖలో ఉద్యోగం పొంది ఉద్యోగరీత్యా కరీంనగర్‌లో స్థిరపడ్డారని తెలిపారు. కరీంనగర్‌లోని ఈఆర్వో కార్యాలయంలో యూడీసీగా విధులు నిర్వహిస్తూ సుదీర్ఘకాలం బాధ్యతలు నిర్వర్తించారని చెప్పారు. వినియోగదారులకు బాధ్యతాయుతంగా సేవలందించడంలో ముందుండేవారని గుర్తు చేశారు.
కరీంనగర్‌లో స్థిరపడినప్పటికీ రేకొండ గ్రామ అభివృద్ధికి వెంకట మల్లయ్య ఎంతో సేవ చేశారని పేర్కొన్నారు. ఆయనతో, ఆయన కుటుంబంతో 40 ఏళ్లకు పైగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, కష్టసుఖాల్లో పాలుపంచుకున్నామని తెలిపారు. మంచి మానవత్వం కలిగిన వ్యక్తిగా వెంకట మల్లయ్య అందరి మన్ననలు పొందారని, ఉద్యోగ విరమణ వరకు ఉన్నతాధికారులు, ప్రజల ప్రశంసలు అందుకున్నారని గుర్తు చేశారు. ఇటీవల అనారోగ్యానికి గురైన వెంకట మల్లయ్య గత ఆదివారం గుండెపోటుతో మృతి చెందడం అత్యంత బాధాకరమని చాడ వెంకటరెడ్డి అన్నారు. మల్లయ్య మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నివాళులర్పించిన వారిలో మండల కొమురయ్య, జయలక్ష్మి, సంపత్ కుమారస్వామి, శారద, శ్రీశైలం, మంజుల, ప్రవీణ్ కుమార్, మనోజ్, మండల అనిల్ తదితరులు ఉన్నారు.

