Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రజల సమస్యలను ప్రతిబింబించే పాటలు రావాలి : చాడ వెంకట్ రెడ్డి

కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్‌ (Karimnagar) లో నిర్వహించిన తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారుల శిక్షణా శిబిరంలో మాజీ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి (Chada Venkat Reddy) కళాకారులకు ముఖ్యమైన పిలుపునిచ్చారు. సమాజంలో జరుగుతున్న పరిణామాలను ప్రతిబింబించేలా, మానవీయ కోణాన్ని ఆవిష్కరించేలా పాటలు రావాలని ఆయన అన్నారు. ప్రజల జీవన విధానాలు, వారి కష్టసుఖాలు, పాలకుల ప్రజా వ్యతిరేక చర్యలపై కళాకారుల గళం తూటాల్లా మారాలని సూచించారు. స్థానిక బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో తెలంగాణ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా కళాకారుల శిక్షణా శిబిరాన్ని ఆయన శనివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన చాడ వెంకటరెడ్డి, కళాకారుల కలం నుంచి ప్రజల చరిత్ర, వారి జీవన శైలి, బాధలు, ఆనందాలు ప్రతిబింబించే రచనలు రావాలని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో నిజాం పాలన, రజాకార్ల ఆగడాలను ఎదిరించిన విప్లవ గీతాలు ప్రజలలో  చైతన్యం నింపాయని గుర్తుచేశారు. ‘బండెనక బండి గట్టి.. ఏ బండ్లో పోతావ్ కొడుకో నైజాం సర్కారోడా’ వంటి పాటలు ప్రజల మనసులలో  ఉద్యమ స్పూర్తిని రగిలించాయని చెప్పారు.

అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి కూడా కళాకారుల పాటలే ఊపిరి పోశాయని ఆయన పేర్కొన్నారు. ప్రజానాట్య మండలి కళాకారులు తమ ఆట, పాటల ద్వారా ప్రజా ఉద్యమాలకు బలాన్నిచ్చారని కొనియాడారు. పాలకులు ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తే వాటిని ప్రశ్నించే శక్తిగా పాటలు మారాలని, ప్రజలను చైతన్యవంతం చేసే బాధ్యత కళాకారులపై ఉందని ఆయన అన్నారు. “కళ కళ కోసం కాదు… ప్రజల కోసం” అనే నినాదాన్ని నిజం చేయడానికి ప్రతి కళాకారుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కళాకారులకు పుట్టినిల్లు లాంటిదని, ఇక్కడి కళా సంపదను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ శిక్షణా శిబిరం ఉపయోగపడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ, సీపీఐ జిల్లా నాయకులు, ప్రజానాట్య మండలి ప్రతినిధులు, పలువురు కళాకారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>