కలం, వెబ్ డెస్క్: డీలిమిటేషన్ (Delimitation Bill), మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లుల ఆమోదానికి కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. ఇందుకోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను (Parliament Session) నిర్వహించనున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13తో ముగియనున్న నేపథ్యంలో.. 16 నుంచి మూడు రోజుల పాటు ఈ ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. వర్షాకాల సమావేశాలను పూర్తిగా వాయిదా (ప్రొరోగ్) వేయకుండా, అవసరమైన సంఖ్యాబలం సమకూరగానే ఎంపీలను వెంటనే సమావేశానికి పిలవాలని కేంద్రం భావిస్తున్నది. గత ఏప్రిల్ నెలలో జరిగిన మూడు రోజుల ప్రత్యేక సమావేశంలో మూడింట రెండు వంతుల (2/3) మెజారిటీ లేకపోవడం వల్లే ఈ బిల్లు లోక్ సభలో వీగిపోయింది.
మారుతున్న సమీకరణాలు
రాజ్యాంగ సవరణ బిల్లులు నెగ్గాలంటే లోక్ సభలో 360 మంది, రాజ్యసభలో 164 మంది ఎంపీల మద్దతు తప్పనిసరి. ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పార్లమెంట్ లో బీజేపీ బలం పుంజుకోవడంతో, మ్యాజిక్ ఫిగర్ కు అవసరమైన దూరం తగ్గింది. అలాగే కాంగ్రెస్ తో విభేదించిన డీఎంకే ఎంపీల మద్దతును కూడా కూడగట్టేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నది. దక్షిణ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన అనేది అత్యంత వివాదాస్పద అంశంగా మారడం, గతంలో దీనిపై డీఎంకే తీవ్ర నిరసనలు తెలపడంతో, ఇప్పుడు ఆ పార్టీ కేంద్రానికి మద్దతు ఇస్తుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.
రిజిజు అభ్యర్థనకు రాహుల్ నిరాకరణ
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతున్నది. బుధవారం ఉభయ సభలు ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే వాయిదా పడ్డాయి. అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఆయన ఛాంబర్లో కలిసి డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుల ఆమోదానికి సహకరించాలని కోరారు. అయోధ్య విరాళాల చోరీ, విద్యార్థుల నిరసనలపై పోలీసుల చర్యల వంటి కీలక అంశాలపై హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేసే వరకు సభలో ఎలాంటి కార్యకలాపాలకు సహకరించబోమని స్పష్టం చేశారు. ఈ పరిణామాలపై చర్చించేందుకు కిరణ్ రిజిజు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, హోంమంత్రి అమిత్ షాతో అత్యవసరంగా సమావేశమయ్యారు.

