కలం, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర ప్రభుత్వం నాన్-డెయిరీ అనలాగ్ (కృత్రిమ) పన్నీర్ (Analogue Paneer) తయారీ, నిల్వ, రవాణా, పంపిణీ, విక్రయాలపై ఒక సంవత్సరం పాటు నిషేధం విధించింది. మహారాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన అనేక పన్నీర్ నమూనాలను ఎఫ్‌డీఏ అధికారులు పరీక్షలకు పంపగా, మార్కెట్లో లభిస్తున్న పలు అనలాగ్ పన్నీర్ రకాలు (సుమారు 40%) భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేలింది. అంతేకాకుండా, వినియోగదారులను తప్పుదారి పట్టించేలా చేసి దాన్ని విక్రయిస్తున్నట్లు తేలింది. ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్న ఇలాంటి ఉత్పత్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవగాహన కార్యక్రమాలు, తనిఖీలు చేపట్టినా పరిస్థితి మెరుగుపడకపోవడంతో కఠిన చర్యలకు దిగింది. దీంతో ఛత్తీస్‌గఢ్ తర్వాత అనలాగ్ పన్నీర్‌పై ఈ ఆంక్షలు విధించిన రెండో రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది.
అసలేంటీ అనలాగ్ పన్నీర్
ఇది పాలతో తయారయ్యే సాధారణ పన్నీర్ కాదు. ఇందులో పాల కొవ్వు, పాల ప్రోటీన్ల స్థానంలో సోయాబీన్ నూనె, పామాయిల్, స్టార్చ్, వివిధ రసాయనాలు, సింథటిక్ పౌడర్‌లను ఉపయోగిస్తారు. రూపం, రుచి పరంగా ఇది సాధారణ పన్నీర్‌లా కనిపించినప్పటికీ, పోషక విలువలు, తయారీ ప్రమాణాల్లో తేడాలు ఉంటాయి. అసలైన పన్నీర్‌తో పోలిస్తే ఇది చాలా చౌకగా లభిస్తుండటంతో.. అనేక హోటళ్లు, దాబాలు, క్యాటరింగ్ నిర్వాహకులు వినియోగదారులకు తెలియకుండా దీన్ని వంటకాల్లో వాడుతున్నారు. కొంతమంది వ్యాపారులు దీనిగురించి సరైన సమాచారం ఇవ్వకుండా పాలతో చేసిన పన్నీర్‌గా విక్రయించడం వల్ల వినియోగదారులు మోసపోతున్నారని అధికారులు తెలిపారు. ఇది ఆరోగ్యానికి తీవ్ర హానికరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉల్లంగిస్తే చర్యలు తప్పవు
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మహారాష్ట్రలో అనలాగ్ పన్నీర్పై ఏడాది పాటు నిషేధం ఉంటుంది. ఉల్లంఘించే తయారీదారులు, విక్రేతలు, సరఫరాదారులపై ఆహార భద్రతా చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు, అసలు పాల ఉత్పత్తుల పేరుతో నాసిరకం ప్రత్యామ్నాయాలను విక్రయించే ధోరణిని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు వెల్లడించారు. ఉత్తర్వులను ఉల్లంఘిస్తే.. ఆరు నెలల జైలు, రూ.లక్ష జరిమానా విధించనున్నారు. ఒకవేళ పన్నీర్ తినడం వల్ల ఎవరైనా చనిపోతే.. శిక్ష తీవ్రత మరింత పెరుగుతుంది. యావజ్జీవ కారాగారశిక్షతోపాటు రూ.10 లక్షల జరిమానా కట్టాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
గుర్తించడమెలా?
– అసలైన పన్నీర్ నుంచి స్వచ్ఛమైన పాల వాసన వస్తుంది. తింటున్నప్పుడు కూడా పాల రుచి తగులుతుంది. అదే అనలాగ్ పన్నీర్ సోయా నూనె లేదా పామాయిల్‌తో తయారవుతుంది కాబట్టి, ఆర్టిఫియల్ లేదా పుల్లటి వాసన వస్తుంది. లేదా కొవ్వు పదార్థం తింటున్న అనుభూతి కలుగుతుంది.
– పన్నీర్‌ను చేతితో నొక్కినప్పుడు సులభంగా విరిగిపోతే అది అసలైనది. కానీ, అనలాగ్ పన్నీర్ ప్లాస్టిక్ లేదా రబ్బరు లా సాగే గుణాన్ని కలిగి ఉంటుంది.
– ఒక ముక్క పన్నీర్‌ను వేడి నీటిలో వేసి కొన్ని చుక్కల అయోడిన్ లేదా టింక్చర్ అయోడిన్ కలపాలి. అనలాగ్ పన్నీర్‌లో స్టార్చ్ (పిండి పదార్థం) వాడతారు కాబట్టి, అది వెంటనే నీలం లేదా నల్లటి రంగులోకి మారుతుంది. అసలైన పన్నీర్ రంగు మారదు.
– ముక్కను పెనం మీద కాల్చితే అసలైన పన్నీర్ కాస్త గట్టిపడి తడిని కోల్పోతుంది. అదే అనలాగ్ పన్నీర్ ప్లాస్టిక్ కరిగినట్లుగా జిగటగా మారుతుంది లేదా కరిగిపోతుంది.
– పన్నీర్ ముక్కను నీళ్ల గ్లాసులో వేస్తే.. మునిగాలి కానీ.. చెక్కు చెదరకుండా ఉండాలి. కల్తీది అయితే కరిగిపోతుంది లేదా విరుగుతుంది.
– మార్కెట్లో అసలైన పన్నీర్ ధర ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సరే మార్కెట్ ధరకంటే చాలా తక్కువకు అమ్ముతున్నారంటే అది కచ్చితంగా అనలాగ్ పన్నీర్ అయ్యే అవకాశాలే ఎక్కువ.

