క్యాట‌రింగ్ పేరుతో భారీ మోసం.. కేటుగాడు అరెస్ట్‌!

కలం, హనుమకొండ: నకిలీ క్యాటరింగ్ కాంట్రాక్టులు (Catering Contract Scam), ఆహార సరఫరా అవకాశాల పేరుతో హాస్టల్ యజమానులను మోసం చేస్తున్న అంతర్ జిల్లా సైబర్ మోస‌గాడిని హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం సాయంత్రం హనుమకొండ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ శ్వేత పూర్తి ఈ అరెస్టుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. నిందితుడు మహమ్మద్ షబ్బీర్ అలియాస్ కిరణ్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, నర్సింహారెడ్డిని ధర్మసాగర్ మండలం మల్లక్‌పల్లి గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు.

ఇతడు ప్రస్తుతం హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌లోని రామ్‌రెడ్డినగర్‌లో నివసిస్తూ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ప్రముఖ ఐటీ కంపెనీ ఉద్యోగి లేదా ప్రతినిధినంటూ పరిచయం చేసుకుని, కంపెనీ ఉద్యోగులకు ఆహారం సరఫరా చేసే కాంట్రాక్టులు ఇప్పిస్తానని నమ్మించి బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. హాస్టల్ బోర్డులపై ఉన్న మొబైల్ నంబర్లను సేకరించి ఫోన్ చేసేవాడు. అగ్రిమెంట్ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఫీజులు, క్యాటరింగ్ సామగ్రి కొనుగోలు తదితర పేర్లతో బ్యాంకు ఖాతాలు, యూపీఐల ద్వారా డబ్బులు బదిలీ చేయించుకునేవాడు. నగదు అందిన తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడం, నంబర్లు మార్చడం చేసేవాడు. కొన్నిసార్లు ఇతరుల యూపీఐ ఖాతాలను కంపెనీ సిబ్బందివిగా నమ్మించి డబ్బులు బదిలీ చేయించుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

23 కేసుల్లో ప్రమేయం

నిందితుడికి వరంగల్ కమిషనరేట్ పరిధిలో 10 కేసులు, ఖమ్మం, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్ జిల్లాల్లో మరో 7 కేసుల్లో ప్రమేయం బయటపడింది. నమోదైన కేసుల్లో రూ.33.33 లక్షల నష్టం జరగగా రూ.12.40 లక్షలు హోల్డ్ చేశారు. మరో ఆరు సైబర్ ఫిర్యాదుల్లో రూ.3.65 లక్షల నష్టం జరిగినట్లు గుర్తించి, రూ.68,430 హోల్డ్ చేశారు. మొత్తంగా రూ.36.99 లక్షల మోసం వెలుగులోకి రాగా రూ.13.09 లక్షలు హోల్డ్ చేశారు.

నిందితుడి వద్ద నుంచి మూడు మొబైల్ ఫోన్లు, మూడు సిమ్ కార్డులు, రెండు బ్యాంకు పాస్‌బుక్స్, చెక్‌బుక్, రెండు ఏటీఎం కార్డులు, డైరీ తదితర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో హనుమకొండ ఇన్‌స్పెక్టర్ మచ్చ శివకుమార్‌తో పాటు పోలీసు సిబ్బంది కీలకంగా పని చేశారు. క్యాటరింగ్, ఉద్యోగ, వ్యాపార అవకాశాల పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. కంపెనీ పేరుతో డబ్బులు అడిగితే అధికారిక మార్గాల్లో వివరాలు నిర్ధారించుకున్న తర్వాతే స్పందించాలని తెలిపారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కి కాల్ చేయాలని సీపీ సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>