కలం, మహబూబ్నగర్ బ్యూరో: చరిత్రలో మనం కాకుండా మనమే ఒక చరిత్ర సృష్టించే స్థాయికి ప్రస్తుత యువత ఎదగాలని సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్, సినీకా క్రియేటర్ కౌన్సిల్ ఫౌండర్ పీజీ విందా (PG Vinda) ఆకాంక్షించారు. యువతలోని నైపుణ్యాలకు సాను బట్టి సమాజానికి ఆదర్శంగా నిలిచే వ్యక్తులుగా మలచడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. మంగళవారం మహబూబ్నగర్ (Mahabubnagar) మహిళా సమాఖ్య భవనంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో సినీకా క్రియేటర్ కౌన్సిల్, సినిమాటిక్ ఎక్స్పో సహకారంతో ‘ఫ్రేమ్స్ ఆఫ్ ఫౌండర్స్’ (Frames of Founders)వర్క్ షాప్ నిర్వహించారు.
ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల నుంచి హాజరైన సృజనాత్మకత కలిగిన యువతతో మమేకమయ్యారు. ఉమ్మడి పాలమూరు ప్రాంతంలోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, వనపర్తి జిల్లాల నుంచి విద్యార్థులు, యువ క్రియేటర్లు, ఔత్సాహిక ఫిల్మ్మేకర్లు, వ్యవస్థాపకులు, మహిళా పారిశ్రామికవేత్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానికంగా విజయవంతమైన ఎంఎస్ఎంఈ లు, వ్యవస్థాపకులు, ఆవిష్కర్తలు, కళాకారులు, స్ఫూర్తిదాయక వ్యక్తుల నిజజీవిత కథలను గుర్తించి, యువ క్రియేటర్ల ద్వారా వాటిని సినిమాటిక్ స్టోరీటెల్లింగ్ రూపంలో ప్రపంచానికి పరిచయం చేయడం ఫ్రేమ్స్ ఆఫ్ ఫౌండర్స్ ప్రధాన లక్ష్యమని పీజీ విందా తెలిపారు.
ప్రతి జిల్లాలో ఒక కథ ఉంది. ప్రతి విజయవంతమైన వ్యక్తి ప్రయాణంలో మరొకరికి స్ఫూర్తినిచ్చే అంశం ఉంటుంది. మన నేల నుంచి పుట్టిన అలాంటి కథలను యువత తమ కెమెరా, సృజనాత్మకతతో ప్రపంచానికి తీసుకెళ్లాలి. స్థానిక కథలు వెండితెరకు చేరాలి అని ఆయన అన్నారు. ఫిల్మ్మేకింగ్, సినిమాటోగ్రఫీ, VFX, యానిమేషన్, డిజిటల్ కంటెంట్, నూతన క్రియేటివ్ టెక్నాలజీల్లో యువత నైపుణ్యాలను పెంపొందించుకుంటే, స్థానికంగానే కొత్త ఉపాధి, స్వయం ఉపాధి, ఎంటర్ప్రెన్యూర్షిప్ అవకాశాలను సృష్టించుకోవచ్చని పీజీ విందా తెలిపారు.
యువ క్రియేటర్లకు పరిశ్రమతో అనుసంధానం – పంజా శ్రావణ్
సినీకా క్రియేటర్స్ కౌన్సిల్ వ్యవస్థాపక డైరెక్టర్ పంజా శ్రావణ్ మాట్లాడుతూ, యువ క్రియేటర్లు, కొత్త ఆవిష్కర్తలకు శిక్షణ, మెంటార్షిప్, నెట్వర్కింగ్తో పాటు పరిశ్రమతో ప్రత్యక్ష అనుసంధానం కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. స్థానిక విజయగాథలను యువత స్వయంగా డాక్యుమెంట్ చేయడం ద్వారా వారికి వాస్తవ ప్రాజెక్టులపై పనిచేసే అనుభవంతో పాటు తమ ప్రతిభను పరిశ్రమకు పరిచయం చేసుకునే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. ఎంపికయ్యే ఉత్తమ విజయగాథలు, వాటిని అత్యుత్తమంగా దృశ్యరూపంలో ఆవిష్కరించిన యువ క్రియేటర్లకు తమ సంస్థ తుది కార్యక్రమంలో పురస్కారాలు అందజేయనున్నారు. అంతేకాకుండా, Frames of Founders ద్వారా వెలుగులోకి వచ్చే అత్యుత్తమ కథల్లో సినిమా కథగా అభివృద్ధి చేయగల సామర్థ్యం ఉన్న వాటిని ఎంపిక చేసి, భవిష్యత్తులో కొత్త సినిమాలుగా రూపొందించే దిశగా ప్రకటించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ అంజనీ దేవి తదితరులు పాల్గొన్నారు.

