సుజ్లాన్‌తో ఏపీకి భారీ పెట్టుబడులు.. లోకేశ్‌ హర్షం

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో సుజ్లాన్‌ (Suzlon) ఎనర్జీ భారీ పెట్టుబడులతో చేపట్టనున్న విండ్‌ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) శ్రీకారం చుట్టారు. అనంతపురంలో (Anantapur) రూ.10,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న 1,325 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టులను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 1,600 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని లోకేశ్‌ పేర్కొన్నారు. అలాగే సుజ్లాన్‌ స్మార్ట్‌ బ్లేడ్‌ తయారీ కేంద్రంలో రెండు కొత్త ఉత్పత్తి లైన్లను ప్రారంభించినట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌తో సుజ్లాన్‌కు రెండు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉందని లోకేశ్‌ తెలిపారు. రాష్ట్రంలో సంస్థ కొనసాగిస్తున్న పెట్టుబడులు ఏపీ ప్రగతిశీల క్లీన్‌ ఎనర్జీ విధానాలు, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణంపై సంస్థకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమలు, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌కు ప్రధాన కేంద్రంగా ఎదుగుతున్న నేపథ్యంలో విశ్వసనీయమైన, స్థిరమైన విద్యుత్‌ అవసరం మరింత పెరుగుతుందని లోకేశ్‌ అన్నారు. ఈ భవిష్యత్‌ అవసరాలను తీర్చడంలో పవన విద్యుత్‌ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోని ప్రముఖ క్లీన్‌ ఎనర్జీ, గ్రీన్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌లలో ఒకటిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నారా లోకేశ్‌ స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>