కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, పునరావాసం (ఆర్ అండ్ ఆర్), అటవీ శాఖ అనుమతుల సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించి, నిర్దేశిత ఆయకట్టుకు వేగంగా నీరందించడమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) స్పష్టం చేశారు.
మంగళవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, నీటిపారుదల శాఖ అధికారులతో ప్రాజెక్టుల పెండింగ్ సమస్యలపై ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో ఖమ్మం కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, ఇరిగేషన్ శాఖ సీఈ వాసంతి, ఎస్‌ఈ ఎం. వెంకటేశ్వర్లు ఇతర అధికారులతో కలిసి పాల్గొన్నారు.
సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రాజెక్టు పనులు వేగవంతం కావాలంటే భూసేకరణ ప్రక్రియను నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్లు ఒక సవాల్‌గా తీసుకుని పూర్తి చేయాలని సూచించారు. రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పెండింగ్ అవార్డులను సకాలంలో పాస్ చేయాలని, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి స్థానిక సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. భూసేకరణ, ఆర్ అండ్ ఆర్‌కు సంబంధించిన టోకెన్లను త్వరితగతిన క్లియర్ చేయాలని పేర్కొన్నారు.
అలాగే కలెక్టర్ల పీడీ ఖాతాల్లో ఉన్న నిధులను అర్హులైన రైతులు, నిర్వాసితులకు తక్షణమే చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు న్యాయమైన పరిహారం అందించి సకాలంలో భూసేకరణ పూర్తి చేయాలని కోరారు. ఈ ప్రక్రియలో అటవీ శాఖ అనుమతులు లేదా ఇతర భూసేకరణ సమస్యలు ఎదురైతే కలెక్టర్లు నీటిపారుదల శాఖ కార్యదర్శితో నిరంతరం సమన్వయం చేసుకోవాలని, క్లిష్టమైన అంశాలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని మంత్రి తెలియజేశారు.

