జడేజా చేతుల మీదుగా సారాంశ్ జైన్‌‌కు టెస్టు క్యాప్‌

కలం, స్పోర్ట్స్: కొలంబోలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు ద్వారా 33 ఏళ్ల ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్ (Saransh Jain) టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. భారత టెస్టు జట్టు తరఫున అరంగేట్రం చేసిన 320వ ఆటగాడిగా సారాంశ్ నిలిచాడు. అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమైన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో సారాంశ్‌కు తుది జట్టులో చోటు దక్కింది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత భారత తుది జట్టులో స్థానం లభించడంతో సారాంశ్‌ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ సందర్భంగా తన చిన్ననాటి జ్ఞాపకాలను, తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. తన తండ్రి సుబోధ్ ప్రోత్సాహంతోనే క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించానని తెలిపాడు.

2014లో తన తండ్రి నోటి క్యాన్సర్‌ బారిన పడటంతో తాను తీవ్ర ఆందోళనకు గురయ్యానని సారాంశ్‌ చెప్పాడు. ఆ సమయంలో క్రికెట్‌ను పూర్తిగా వదిలేయాలని నిర్ణయించుకున్నానని వెల్లడించాడు. అయితే తండ్రి తనకు ధైర్యం చెప్పి ఆటను కొనసాగించేలా ప్రోత్సహించారని భావోద్వేగంగా తెలిపాడు. తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఇన్నేళ్లు క్రికెట్‌లో కొనసాగానని సారంచ్ పేర్కొన్నాడు. ఇప్పుడు టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేయడం తనకు ఎంతో ప్రత్యేకమైన క్షణమని చెప్పాడు. దేశవాళీ క్రికెట్‌లో ఎన్నో ఏళ్లుగా సారాంశ్‌ జైన్ కష్టపడుతున్నాడు. రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించాడు. ఇండియా-ఎ తరఫున కూడా వరుసగా అద్భుత ప్రదర్శనలు చేస్తూ ఆల్‌రౌండర్‌గా తన సత్తా చాటుకున్నాడు.తన నిలకడైన ప్రదర్శనతో జాతీయ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన సారాంశ్‌కు ఎట్టకేలకు టీమిండియా పిలుపు వచ్చింది. దీంతో అతడి సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది.

సారాంశ్‌ జైన్‌కు మరో ప్రత్యేకత కూడా దక్కింది. భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) చేతుల మీదుగా అతడు టెస్టు క్యాప్ అందుకున్నాడు. ఒక గొప్ప ఆల్‌రౌండర్ నుంచి డెబ్యూ క్యాప్ తీసుకోవడం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని సారాంశ్‌ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా మొదట దేవుడికి, ఆ తర్వాత తన కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపాడు. తన తండ్రి ఆశయ సాధన కోసం మైదానంలో ఆడుతూనే ఉంటానని భావోద్వేగంగా పేర్కొన్నాడు. సారాంశ్‌ను రవీంద్ర జడేజా అభినందించాడు. దేశవాళీ క్రికెట్‌లో అతడు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం లభించిందని ప్రశంసించాడు. అంతర్జాతీయ స్థాయి అనే ఒత్తిడిని ఏమాత్రం తలకెక్కించుకోకుండా సాధారణ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాగే భావించి ఆటను ఆస్వాదించాలని సూచించాడు. మైదానంలో, డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న సహచరులందరి మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని జడేజా భరోసా ఇచ్చాడు. తన తొలి టెస్టును ఆత్మవిశ్వాసంతో ఆడి సత్తా చాటాలని ఆకాంక్షించాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>