కలం, ఖమ్మం బ్యూరో: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం (Bhadrachalam) శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాలు నేత్ర పర్వంగా సాగుతున్నాయి. పాంచరాత్ర ఆగమశాస్త్ర విధానంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజున స్వామివారికి 108 కలశాలతో శ్రీరామ దివ్యాభిషేకం (అష్టోత్తర శతకలశాభిషేకం) పవిత్రారోపణ ఘట్టాలను శాస్త్రోక్తంగా పూర్తిచేశారు.
ముందురోజున ఆలయంలో ప్రత్యేకంగా ఆవాహన చేసిన 108 కలశాలలోని పవిత్ర జలాలు, దివ్య ద్రవ్యాలను వేద మంత్రోచ్ఛారణల మధ్య వినియోగిస్తూ సీతారామచంద్రస్వామికి వైభవంగా అభిషేకం జరిపారు. ఈ దివ్య క్రతువును కళ్లారా దర్శించినా, ఇందులో పాల్గొన్నా, స్వామివారి పవిత్ర తీర్థాన్ని శిరస్సుపై ప్రోక్షించుకున్నా శత్రుజయం, ఆయురారోగ్యాలు, బుద్ధి వికాసం కలుగుతాయని, సకల శుభాలు సిద్ధిస్తాయని ఆలయ అర్చకులు వెల్లడించారు.
అభిషేకానంతరం మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు, ఆలయంలోని పవిత్ర సేవోపకరణాలకు నిన్నటి రోజున అధివాసం చేసిన పవిత్రాలను సమర్పించే ‘పవిత్రారోపణ’ కార్యక్రమాన్ని క్రమపద్ధతిలో నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలను వేలాది మంది భక్తులు తిలకించి రామచంద్రస్వామి కృపాకటాక్షాలు పొందారు.

