కలం, వెబ్ డెస్క్ : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని (Godavarikhani)లో పెను విషాదం చోటుచేసుకుంది. స్థానిక రాజేష్ థియేటర్ సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
వేగంగా దూసుకొచ్చిన కారు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో, అందులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు లోపలే ఇరుక్కుపోయారు. స్థానికుల సమాచారంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కారులో ఇరుక్కున్న వారిని బయటకు తీశారు. అయితే, దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో శ్రీధర్ అనే సింగరేణి ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందారు.
తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో, పోలీసులు వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

