కలం, వెబ్ డెస్క్ : పెద్దపల్లి (Peddapalli) జిల్లా బసంత్‌నగర్ సమీపంలోని బుగ్గ రాజేశ్వర స్వామి మలుపు వద్ద ఈరోజు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దంపతులు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నుండి మంచిర్యాల వైపు వెళ్తున్న కారు అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును అతి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారులో ప్రయాణిస్తున్న మంచిర్యాలకు చెందిన ఎడ్ల శ్రీనివాస్, ఆయన భార్య ఎడ్ల రజితలు అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రమాద సమయంలో కారులో ఉన్న వారి కుమార్తె రిశిత తీవ్రంగా గాయపడ్డారు. ఆమె ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతున్నట్లు తెలిసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన రిశితను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి (Peddapalli) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

