Mobile Popup Ad
Mobile Popup Ad

మంజీరా పైప్‌లైన్‌ లీకేజీల‌కు చెక్‌.. రూ.772 కోట్లతో ఆధునికీక‌ర‌ణ‌

కలం, మెదక్ బ్యూరో: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ (Hyderabad)కు వచ్చారంటే మంజీరా నీళ్లు బాగా పడ్డాయి అని అనడం నానుడిగా వినిపిస్తుంది. మంజీరా తాగునీరు హైదరాబాద్ మహానగర వరప్రదాయని. జంట నగరాల ప్రజల దాహార్తిని తీర్చే అమృతభాండం. అలాంటి మంజీరా పైప్ లైన్ల (Manjeera Pipeline) ద్వారా నీటి సరఫరాల్లో ఏళ్ల తరబడి ఎదురవుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా మొదటి అడుగు పడింది.

హైదరాబాద్‌ గొంతు తడుపుతున్న మంజీరా

హైదరాబాద్ మహానగర తాగునీటి అవసరాల కోసం సంగారెడ్డి జిల్లా మంజీరా నదిపై కలబ్ గూర్ వద్ద 1.5 టీఎంసీ సామర్థ్యంతో మంజీరా బ్యారేజిని 1961 నిర్మాణం చేశారు. ఈ బ్యారేజి వద్ద 230 ఎంజీడీ సామర్థ్యం కల్గిన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌తో నీటిని శుద్ది చేసి పైపుల ద్వారా హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. మంజీరా బ్యారేజి నుండి 1965లో వేసినా మంజీరా ఫేజ్-1 నుండి 15 ఎంజీడీ, అలాగే 1981లో వేసిన ఫేజ్-2 నుండి 30 ఎంజీడీ నీళ్లను క‌లుపుకొని మొత్తం 45 ఎంజీడీ సామర్థ్యం గల నీళ్లను పైప్ లైన్ల‌ ద్వారా హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో 60 ఏళ్లుగా సరఫరా చేస్తున్నారు. ఈ రెండు ఫేజ్‌లలో 1500 మి.మీ వ్యాసం కలిగిన‌ పైపులైన్ల‌తో మంజీరా డ్యాం నుండి హైదర్‌నగర్ వరకు నీటిని పంపింగ్ చేసి, అక్కడ నుండి హైదరాబాద్ పరిధిలో చాలా ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేస్తారు.

కేబినెట్ నిర్ణయంతో కొత్త ఆశలు

సుమారు 60 ఏళ్ల‌ క్రితం నిర్మించిన‌ టీఎంసీ పైప్‌లైన్లు చాలా ప్రాంతాల్లో తరచూ పగిలిపోతున్నాయి. లీకేజీలు కూడా అవుతున్నాయి. కొన్నిసార్లు లీకేజీలతో నీరు కలుషితం అవుతుంది. పలు సందర్భాల్లో హైదరాబాద్‌లో నీటి సరఫరాకు ఆటంకం క‌ల‌గ‌డంతో పాటు పెద్దఎత్తున నీరు వృథా అవుతోంది. ఈ నేపథ్యంలో మంజీరా తాగునీటి సరఫరాకు ఆటంకం లేకుండా భవిష్యత్తు అవసరాల కోసం పాత పైపు లైన్ల స్థానంలో రూ.772 కోట్లతో కొత్త పైపులైన్లు వేయడానికి తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. దీంతో మంజీరా పాత లైన్లను పూర్తిగా తొలగించి, వాటి స్థానంలో కొత్తగా మైల్డ్ స్టీల్ లైనింగ్ కల్గిన పైపు లైన్లు వేయనున్నారు.

ఇప్పటి వరకు మంజీరా డ్యాం నుండి రోజు మొత్తం 45 ఎంజీడీల సామర్ధ్యం గల నీళ్లు హైదరాబాద్ మహానగర అవసరాల కోసం సరఫరా చేస్తుండగా, దీని సామర్ధ్యం 50 ఎంజీడీ వరకు పెంచనున్నారు. సంగారెడ్డి శివారు మంజీరా బ్యారేజి నుండి హైదర్ నగర్ వరకు రూ.772 కోట్లతో మొత్తం 29.57 కిలో మీట‌ర్ల మేర కొత్త పైప్ లైన్లు వేయనున్నారు. గతంలో టీఎంసీ పైప్ లైన్లు వేయగా, ప్రస్తుతం మైల్డ్ స్టీల్ పైపు లైన్లు వేయనున్నారు. కొత్త లైన్లు పూర్త‌యితే లీకేజీ సమస్యలు తొలిగి నిరంతర మంజీరా నీటి సరఫరా జరగనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>