కలం, ఖమ్మం బ్యూరో : ఇన్సూరెన్స్ డబ్బులు కొట్టేయాలని.. ఇద్దరు కేటుగాళ్లు స్నేహితుడికే స్కెచ్ వేశారు. పక్కా ప్లాన్‌తో హత్య చేసి దాన్ని యాక్సిడెంట్‌గా చిత్రీకరించి రెండు కోట్లు కొట్టేయాలని ప్లాన్ వేశారు. కానీ బూర్గంపాడు ఎస్ఐ మేడ ప్రసాద్ (SI Meda Prasad) కుట్రను ఛేదించి మంగళవారం ఇద్దరినీ కటకటాల పాలు చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బూర్గంపాడు (Burgampadu)మండలం సారపాకకు చెందిన యశ్వంత్, సాయి దీపక్ ఇద్దరూ స్నేహితులు. యశ్వంత్‌కు తల్లిదండ్రులు, బంధువులు లేరు. ఒంటరిగా ఉండేవాడు. అప్పుడపుడు ఐటీసీలో కాంట్రాక్ట్ లేబర్‌గా పని చేస్తుండేవాడు. ఈ నేపథ్యంలోనే సాయి దీపక్, యశ్వంత్‌కు దగ్గరయ్యాడు. యశ్వత్ పేరు మీద రెండు కోట్ల రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు.
భద్రాచలానికి చెందిన ఓ ప్రైవేటు బ్యాంకు ఇన్సూరెన్స్ ఉద్యోగి భాను ప్రకాష్ సహాయంతో సాయి దీపక్, యశ్వంత్‌ను హతమార్చి ఇన్సూరెన్స్ డబ్బులు కొట్టేయాలని ప్లాన్ వేశాడు. అందులో భాగంగా యశ్వంత్ కు స్కూటీ ఇప్పించి సారపాక సమీపంలోని మోతె పట్టీనగర్ కు రమ్మని చెప్పారు. అప్పటికే సాయి దీపక్, భాను ప్రకాష్ కారులో అక్కడికి చేరుకున్నారు. యశ్వంత్‌కు మద్యం తాగించి తల మీద బలంగా కొట్టి స్పృహ తప్పేలా చేసి, రోడ్ పై పడుకోబెట్టారు.
రక్తపు మడుగులో పడి ఉన్న యశ్వంత్‌ను స్థానికులు హాస్పిటల్లో చేర్పించే ప్రయత్నం చేస్తుండగా, నిందితులు కూడా వచ్చి గాయపడింది మాకు తెలిసిన వాడే అని చెప్పి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అనంతరం యాక్సిడెంట్ కేసు నమోదు చేసిన బూర్గంపాడు ఎస్ఐ మేడ ప్రసాద్ (SI Meda Prasad) కు అనుమానం రావడంతో తనదైన శైలిలో ఇద్దరు నిందితులను విచారించగా.. నేరాన్ని ఒప్పుకొని సరెండర్ అయ్యారు.


