కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఎన్టీవీలో ప్రసారమైన కథనాలపై సిట్ ఏర్పాటు చేసినట్లే ఆంధ్రప్రదేశ్ కథనాలపై దర్యాప్తు చేయాలని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ (MLC Desapati Srinivas) డిమాండ్ చేశారు. ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణతో సీఎం కు మంచి సంబంధాలున్నాయని అందరికి తెలుసన్నారు. రాధాకృష్ణ పుట్టినరోజున రేవంత్ రెడ్డి స్వయంగా ఇంటికి వెళ్లారన్నారు.
వార్త రాసే ముందు తనను వివరణ అడగాలి అని మెత్తటి మాటలతో సరిపుచ్చడం హాస్యాస్పదమని దేశపతి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే.. కేవలం మాటలకే పరిమితం కాకుండా, వెంటనే సిట్ ఏర్పాటు చేసి, సమగ్ర విచారణ జరిపించి, వాస్తవాలను నిగ్గు తేల్చాలన్నారు. చట్టప్రకారం దోషులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.


