కలం, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా నడుస్తున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంలో అధికార పార్టీ, విపక్ష పార్టీల మధ్య ఘాటు చర్చలు కొనసాగాయి. ముఖ్యంగా మూసీ ప్రాజెక్టు అంశం అసెంబ్లీలో తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మూసీలోని కాలుష్యం కంటే బీఆర్ఎస్ (BRS) నేతల కడుపుల్లోనే ఎక్కువ విషం ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నుంచి తీవ్ర వ్యతిరేకత మొదలైంది. మూసీపై సీఎం మాట్లాడిన తర్వాత తమకు అవకాశం ఇవ్వలేదని అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. అలాగే యూరియా సమస్యపై కేటీఆర్ (KTR) ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడం కూడా గందరగోళానికి దారితీసింది.
స్పీకర్ పక్షపాత వైఖరి నశించాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి గన్ పార్కుకు కాలినడకన బయలుదేరి అక్కడ నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ (Gaddam Prasad) “అసెంబ్లీ సమావేశాలను నడుపుతున్నారా? లేక కాంగ్రెస్ శాసనసభా సమావేశాన్ని (సీఎల్పీ మీటింగ్) నడుపుతున్నారా?” అని ప్రశ్నించారు. సభలో అధికార ప్రతిపక్ష సభ్యులను సమాన దృష్టితో చూడాల్సిన స్పీకర్ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని, ఇది సభా సంప్రదాయాలకు విరుద్ధమన్నారు. ఈ ధోరణి పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.
“ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. బూతుల రాజ్యం.. మూర్ఖుల రాజ్యం..” అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ తీరు మారకపోతే సభకు హాజరై ప్రయోజనం లేదని, ఆయన తన తీరు మార్చుకుంటారనే నమ్మకం తమకు లేదని, అందువల్లనే ఈ రోజు సమావేశాల నుంచి వాకౌట్ చేసి బైటకు వచ్చినా రేపటి నుంచి ఈ సెషన్ కంప్లీట్ అయ్యేంత వరకు అసెంబ్లీ సెషన్‌కు హాజరుకావడంలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని అసెంబ్లీలో వివరించడానికి స్పీకర్ వైఖరి కారణంగా తమకు అవకాశం లేకపోవడంతో తెలంగాణ భవన్ వేదికగా జనవరి 3న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రజలకు వివరిస్తామని బీఆర్ఎస్ (BRS) డిప్యూటీ ఫ్లోర్ లీడర్ (అసెంబ్లీ) హరీశ్‌రావు తెలిపారు.
Read Also: ‘పాలమూరు’ అవకతవకలపై ‘సిట్’ కాంగ్రెస్ నేతలు, కవిత డిమాండ్
Follow Us On: Youtube


