రామగుండంలో కేటీఆర్ సభ.. పొలిటికల్ సెగ!

కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ బొగ్గు గని నెలవైన రామగుండంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ నెల 14న బీఆర్ఎస్ ‘సింగరేణి కార్మిక గర్జన’ పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించబోతుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)  ముఖ్య అతిథిగా హాజరై కార్మిక లోకానికి దిశానిర్దేశం చేయనున్నారు. ​సింగరేణి కార్మికులు, కుటుంబాల సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించిన బీఆర్ఎస్ ఈ సభ ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సమర శంఖం పూరిస్తోంది. పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌లీడ‌ర్ హరీష్ రావు నేతృత్వంలో గులాబీ శ్రేణులు, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) నాయకులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని సభను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

​కార్మికుల సంక్షేమం.. హక్కులు

ఈ సభ ద్వారా సింగరేణి కార్మికులకు చెల్లించాల్సిన అలవెన్సులు, పెండింగ్ సమస్యలు, పని వాతావరణంలో భద్రత వంటి అంశాలపై కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది. ​సొంత ఇంటి కల, క్వార్టర్ల వ్యవహారం, కార్మికుల ఇళ్ల స్థలాలు, క్వార్టర్ల క్రమబద్ధీకరణ, మౌలిక వసతుల కల్పనలో జరుగుతున్న జాప్యాన్ని ఎత్తిచూపబోతున్నారు. సింగరేణి పరిధిలోని బొగ్గు బ్లాకుల కేటాయింపు, ప్రైవేటీకరణ యత్నాలను అడ్డుకోవడానికి కార్మిక వర్గాన్ని చైతన్యపరచబోతున్నారు. వారసత్వ కారుణ్య నియామకాల ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేయబోతున్నారు.

​కేటీఆర్ రాజకీయ వ్యూహం..

అధికారంలో ఉన్నప్పుడు TBGKS ద్వారా సింగరేణిపై పట్టు సాధించిన బీఆర్ఎస్ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంది. ఈ తరుణంలో కార్మికుల వైపు నిలబడి మళ్లీ కోల్ బెల్ట్‌లో పట్టును నిలుపుకోవాలని చూస్తోంది. రామగుండం వేదికగా జరగనున్న ఈ ‘కార్మిక గర్జన’ సభ ద్వారా కేటీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను, కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు బలమైన రాజకీయ ప్రసంగాన్ని సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ​గోదావరిఖని, రామగుండం, మంచిర్యాల, కొత్తగూడెం, భూపాలపల్లి ప్రాంతాల నుంచి వేలాది మంది కార్మికులు, బీఆర్ఎస్ నాయకులు ఈ సభకు తరలిరానుండటంతో ఉత్తర తెలంగాణలో ‘సింగరేణి కార్మిక గర్జన’ ఆసక్తిని కలిగిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>