కలం, జోగులాంబ గద్వాల: కష్టపడి చదివి ఎంబీబీఎస్ (MBBS) సీట్లు సాధించిన ఇద్దరు ప్రతిభావంతులైన పేద విద్యార్థినులకు “సామాజిక బాధ్యత” టీమ్ (Samajika Badhyata Team) ఆర్థికంగా అండగా నిలిచింది. ఈ మేరకు టీమ్ సభ్యులు గురువారం రూ.65,000లను వారికి అందించారు. అనంతరం గద్వాలలోని స్మృతి వనంలో సామాజిక బాధ్యత టీమ్ సభ్యులు ఇద్దరు విద్యార్థినులను సన్మానించారు.
ఏపీలోని కర్నూలు జిల్లా గూడూరు మండలం, చనుగొండ్ల గ్రామానికి చెందిన కీర్తి చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి టెన్త్, ఇంటర్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. 2026 నీట్ (NEET) పరీక్షలో 436 మార్కులు సాధించి, కర్నూలులోని విశ్వభారతి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో MBBS సీటు పొందింది. కాలేజీ ఫీజు చెల్లించడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ అమ్మాయి అభ్యర్థన మేరకు టీమ్ తరఫున రూ. 32,500 చెక్కును అందజేశారు.
గద్వాల మండలం, ఆత్మకూర్ గ్రామానికి చెందిన దీపిక చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. తల్లి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించింది. దీపిక టెన్త్ వరకు ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్మీడియట్ షాద్‌నగర్‌లోని ‘కమ్మదనం’ ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలో చదివి మంచి మార్కులు సాధించింది. 2026 నీట్ పరీక్షలో 396 మార్కులు సాధించి, మేడ్చల్‌లోని CMR ప్రైవేట్ మెడికల్ కాలేజీలో MBBS సీటు సాధించింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఫీజుల కొరకు అభ్యర్థించగా, ఈ అమ్మాయికి కూడా రూ. 32,500 చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు వెంకటేష్, మురళి, బెంజావేను, వెంకట్రాముడు, రామన్న, నగేష్, చార్లెస్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

