కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ రైతు డిక్లరేషన్ హామీలను గాలికొదిలేసి, రైతాంగాన్ని దగా చేసిందని బీఆర్‌ఎస్ (BRS) జిల్లా మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఖమ్మంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మిషన్ కాకతీయ, భక్త రామదాసు ప్రాజెక్టులతో వ్యవసాయాన్ని పండుగలా మార్చారని వారు గుర్తుచేశారు.
బీఆర్‌ఎస్ హయాంలో 90 శాతం పూర్తయిన సీతారామ ప్రాజెక్టు కాల్వల మట్టిని జిల్లా మంత్రులు అక్రమంగా అమ్ముకుంటూ దోపిడీకి తెరలేపారని ఆరోపించారు. అలాగే, సత్తుపల్లి బుగ్గపాడు ఫుడ్ పార్క్‌లో ఎకరా రూ.40 లక్షల విలువైన భూములను, నిబంధనలకు విరుద్ధంగా ఒక ప్రైవేట్ కంపెనీకి కేవలం రూ.21 లక్షలకే కేటాయించి వందల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ సంస్థాగత బలోపేతం, సభ్యత్వ నమోదుపై ఈ నెల 24న ఉదయం 10:30 గంటలకు సత్తుపల్లి నియోజకవర్గ కేంద్రంలో ఒక రోజు అంతర్గత శిక్షణా శిబిరం నిర్వహించనున్నామన్నారు.
ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారని తెలిపారు. ఈ శిబిరానికి నిర్దేశిత బూత్ స్థాయి ఇన్‌ఛార్జులు, ఆహ్వానితులు మాత్రమే సకాలంలో హాజరుకావాలని పార్టీ వర్గాలు కోరాయి. ఈ సమావేశంలో మాజీ డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం సహా పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

