నేడు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ఏర్పాటైన గులాబీ పార్టీ నేటితో 25 వసంతాలు పూర్తి చేసుకుంది. కేసీఆర్‌ నాయకత్వంలో 2001 ఏప్రిల్‌ 27న జలదృశ్యంలో టీఆర్ఎస్ పురుడుపోసుకుంది. రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ వస్తుందని బలంగా నమ్మిన కేసీఆర్ అదే విజన్ తో 13 ఏళ్ల పాటు ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. తనదైన రాజకీయ వ్యుహాలు, ఎత్తుగడలతో 2014 ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటులో బీఆర్ఎస్ (BRS) కీలక పాత్ర పోషించింది. అయితే దేశవ్యాప్తంగా విస్తరించాలనే ఉద్దేశంతో కేసీఆర్ టీఆర్ఎస్ ను 2022లో బీఆర్ఎస్ గా మార్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయిన బీఆర్ఎస్.. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఒక్కస్థానం కూడా దక్కించుకోలేదు. తెలంగాణ రాజకీయ ప్రస్థానంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ నేడు ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది.

కేటీఆర్ కీలక పిలుపు

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ జెండాలను ఎగరేసి వేడుకలను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం నాటి టెలీకాన్ఫరెన్స్‌లో ఈ నిర్ణయాన్ని వెల్లడిస్తూ, గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో పార్టీ పతాకాలను ఆవిష్కరించాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా సోమవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పతాకావిష్కరణ చేయనున్నారు. అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం

బీఆర్‌ఎస్‌ 26వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురుస్కరించుకోని హైదరాబాద్‌ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే సమావేశానికి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఇటీవల జగిత్యాలలో నిర్వహించిన భారీ బహిరంగ సభ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న తీవ్రమైన ఎండల కారణంగా ఈసారి ప్లీనరీకి బదులుగా కేవలం కార్యవర్గ సమావేశానికే పరిమితం చేస్తున్నట్లు పార్టీ తెలిపింది. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, కీలక నేతలను మాత్రమే ఆహ్వానించారు. ఆహ్వానం అందిన వారు మాత్రమే తెలంగాణ భవన్‌కు రావాలని, మిగిలిన నాయకులు తమ పరిధిలోని ప్రాంతాల్లోనే ఉండి పార్టీ కార్యక్రమాలను చేపట్టాలని కేటీఆర్ ఆదేశించారు. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయడం.. భవిష్యత్ రాజకీయ కార్యాచరణ, ముఖ్యంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల దిశగా పార్టీని బలోపేతం చేసే అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>