Mobile Popup Ad
Mobile Popup Ad

కరీంనగర్ బంద్.. ఎమ్మెల్యే గంగుల హౌజ్ అరెస్ట్

కలం , కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మాజీ మంత్రి , ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య తలెత్తిన వివాదం జిల్లాలో ఉద్రిక్తతలకు దారితీసింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై బీజేపీ శ్రేణులు దాడికి నిరసనగా నేడు (శనివారం) జిల్లా బంద్ (Karimnagar Bandh) కు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా పోలీసులు గంగుల కమలాకర్ నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఆయనను ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. ​గంగుల కమలాకర్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ​కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య గత కొన్ని రోజులుగా సాగుతున్న మాటల యుద్ధం, తాజా వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ​బంద్ పిలుపుతో నగరంలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లలో పోలీస్ పహారా కొనసాగుతోంది. రాజకీయ నాయకుల అరెస్టులతో కరీంనగర్‌లో ఉత్కంఠ నెలకొంది. శాంతిభద్రతల దృష్ట్యా ప్రజలు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.

కాగా, హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు, కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేశారు. కౌశిక్ రెడ్డి కారును ధ్వంసం చేశారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు సరికాదన్నారు. ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకే బండి సంజయ్ తన అనుచరులను రెచ్చగొట్టి దాడులకు ఉసిగొల్పారని ఆరోపిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>