కలం, వెబ్ డెస్క్: సైబర్ మోసాల (Cyber Fraud)కు సామాన్య ప్రజలతో పాటు అధికారులు, రాజకీయ నాయకులూ బలవుతున్నారు. సోషల్ మీడియా, ఆన్ లైన్ మోసాల్లో కొత్త దారులు వెతుకుతూ సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేస్తున్నారు. తాజాగా ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం పేరుతో ఏకంగా ఎమ్మెల్యే నుంచి లక్ష రూపాయలు కొట్టేశారు. వివరాల్లోకి వెళ్తే.. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy)కి ఇటీవల ఓ ఫోన్ కాల్ వచ్చింది. “వికసిత్ భారత్” పథకం గురించి ఫోన్ చేస్తున్నట్లు సదరు వ్యక్తి ఎమ్మెల్యేను నమ్మించాడు. అర్హుల జాబితా పంపిస్తే రూ.10 లక్షల రుణాలు ఇస్తామని చెప్పాడు. దీనికి ముందుగా నగదు పంపాలని ఎమ్మెల్యేకు సూచించాడు. ఒక్కొక్కరికి రూ.2,500 చొప్పున రూ.లక్ష ప్రాసెసింగ్ ఫీజు పంపించాలన్నాడు. దీంతో పల్లా ఫోన్ పే ద్వారా డబ్బులు పంపించాడు. తర్వాత సదరు వ్యక్తి మళ్లీ ఫోన్ చేసి నగదు పంపించాలని అడిగాడు. దీంతో పల్లా రాజేశ్వర్ రెడ్డి తాను మోసపోయినట్లు గుర్తించాడు. వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆన్ లైన్ మోసాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

