కలం, వెబ్‌డెస్క్: క్రికెట్ దిగ్గజం, భారత రత్న సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన కుమారుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) ఓ ఇంటివాడు కానున్నారు. ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్‌తో అర్జున్ ఏడడుగులు నడవనున్నాడు. ఈ మేరకు వీరి పెళ్లికి ఆహ్వానించేందుకు భార్య అంజలి, కుమార్తె సారాతోపాటు సచిన్ టెండూల్కర్ ప్రధాని నరేంద్ర మోదీని (PM Modi) ఆయన నివాసంలో కలిశారు. పెళ్లి పత్రిక అందించారు. దీనికి సంబంధించిన ఫొటోలను సచిన్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. ‘అర్జున్, సానియా వివాహానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించడం మాకు గౌరవంగా ఉంది. యువ జంటకు ఆశీర్వాదాలు, ఆలోచనాత్మక సలహాలు అందించినందుకు ప్రధానికి ధన్యవాదాలు’ అని సచిన్ తన ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొన్నారు.
కాగా, పెళ్లి వేడుకలు మార్చి 3న ప్రారంభం కానున్నాయి. మార్చి 5న వివాహ ముహూర్తం నిశ్చయించారు. గతేడాది ఆగస్టులో అర్జున్, సానియా నిశ్చితార్థం జరిగింది. తండ్రి బాటలోనే క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్న అర్జున్ (Arjun Tendulkar) దేశవాళీ మ్యాచ్‌ల్లో ముంబై తరఫున ఆడుతున్నాడు. ఐపీఎల్లో ముంబై నుంచి ఇటీవల లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు మారాడు. సానియా ప్రస్తుతం వారసత్వంగా వచ్చిన వ్యాపార బాధ్యతలను చూసుకుంటోంది. వీళ్ల కుటుంబానికి ఏళ్లుగా సచిన్ ఫ్యామిలీతో సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడవి బంధంగా మారనున్నాయి.
Read Also: దేశ వ్యాప్తంగా చిన్నారుల మిస్సింగ్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Follow Us On : WhatsApp


