Mobile Popup Ad
Mobile Popup Ad

రేవంత్ పర్యటనతో పాలమూరుకు ఒరిగింది శూన్యం: బీఆర్ఎస్ నేతలు

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : పాలమూరు(Palamuru) జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పర్యటనలు చేసినప్పటికీ జిల్లాకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విమర్శించారు. శనివారం మహబూబ్‌నగర్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రులు డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ సి. లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు మాట్లాడారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రెండు రోజుల పర్యటనలో జిల్లాకు ఎలాంటి వరాలు రాలేదని అన్నారు. నిలిచిపోయిన ప్రాజెక్టుల కోసం నిధులు కేటాయించకుండా, బీఆర్ఎస్‌పై విమర్శలు చేయడం సరికాదని అన్నారు.  పాలమూరు ప్రాజెక్ట్ పూర్తి చేసే స్పష్టత కూడా సీఎం సమావేశాలలో ఇవ్వలేదని ఆయన విమర్శించారు. జూరాల పరిధిలో చెక్‌డ్యామ్‌ల నిర్మాణంపై ఏరియల్ సర్వే చేయడం తప్ప రాష్ట్రానికి ఉపయోగం లేదని  ఆరోపించారు. కర్ణాటక వైపు పర్యటనలు చేసి అక్కడి పనులను పరిశీలించారని, కానీ తెలంగాణకు ప్రయోజనం కలగలేదని వ్యాఖ్యానించారు.

అలాగే ఆదిత్యనాథ్ అనే అధికారిని తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ నీటిని తరలించే కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. కాలువలు, టన్నెల్లు, రిజర్వాయర్లు వంటి ప్రాజెక్టులను కేసీఆర్ ప్రభుత్వమే నిర్మించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వాటికి కనీసం చిన్న పనీ చేయలేదని విమర్శించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌లో రూ.33,500 కోట్ల పనులు పూర్తయ్యాయని, పెండింగ్ బిల్లుల పేరుతో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నట్లు చూపిస్తోందని అన్నారు. గతంలో కాంగ్రెస్ నేతలు కేసులు వేయడం వల్లే ప్రాజెక్టులు ఆలస్యం అయ్యాయని ఆరోపించారు.

ప్రస్తుత ప్రభుత్వం రెండున్నరేళ్లలో ఒక్క కాలువ కూడా తవ్వలేదని, రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలను విమర్శించడం తప్ప అభివృద్ధి పనులు చేయలేదని అన్నారు. రాబోయే రోజులలో ప్రజలే సరైన తీర్పు ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, తమ పాదయాత్ర ప్రకటనతోనే సీఎం ప్రాజెక్టుల పర్యటనకు వచ్చారని ఎద్దేవా చేశారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటివరకు చేసిన పనులపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, స్థానిక నాయకులు ఇంతియాజ్, రాజేశ్వర్ గౌడ్, మాజీ ముడా చైర్మన్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>