కలం, ఆదిలాబాద్ బ్యూరో: వానాకాలం వస్తే చాలు. వరదొచ్చి ప్రాజెక్టు నిండుకుండలా మారేది. ఆపై ఆనకట్టపై నుంచి నీరు కిందకు దుంకేది పంట పొలాలను ముంచెత్తేది. ఈసారి ఎల్ నినోతో వర్షాలు లేక, వరద రాకపోగా.. ప్రాజెక్ట్‌లోని నీరు అడుగంటింది. ఎడారిలా మారింది. గేట్ల వద్ద నీళ్లు లేవు. కాల్వల్లోకి చుక్క పారడంలేదు. నీళ్లు లేక నారు మడులు ఎండిపోతున్నాయి. వర్షం రాకకు రైతులు దిక్కులు చూస్తున్నారు. ఇదీ కడెం ప్రాజెక్టు (Kadem Project) ఆయకట్టు పరిస్థితి.
ఎండిన వరప్రదాయని..
నిర్మల్ జిల్లాలోని కడెం ఆయకట్టును గోదావరి డెల్టాగా పిలుస్తారు. వర్షకాలం వచ్చిందంటే భారీగా ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరుతుంది. సాగుకు రైతులకు డోకా ఉండదు. మంచిర్యాల, ఖానాపూర్ నియోజకవర్గాల్లోని 69 వేల ఎకరాల్లో రెండు పంటలు సాగయ్యేవి. నిత్యం సాగునీరు ఉండటంతో కరువు ఎరగరు. అందుకే కడెంను రైతులు వర ప్రదాయనిగా భావిస్తారు. అలాంటి పరిస్థితిపై ఈసారి ఎల్ నినో దెబ్బకొట్టింది.
వర్షాలు లేవు. ఎగువ నుంచి వరదలేదు. ఖరీఫ్ సీజన్ మొదలై దాదాపు నలభై రోజులు గడిచాయి. ప్రాజెక్టులోకి నీరు చేరలేదు. ప్రాజెక్ట్ పూర్తి నీటినిల్వ సామర్థ్యం 3.4 టీఎంసీలు. కానీ ప్రస్తుతం అర టీఎంసీ నీరు కూడా లేదు. ఇసుక దిబ్బలతో వెలవెలబోతుంది. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు లేవు. ఈసారి ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో రైతులు సాగుపై ఆందోళనలో పడ్డారు. నారు మడులు వేసుకోవాలంటే జంకుతున్నారు. బావులు కింద మాత్రమే రైతులు నారు మడులు వేసుకుంటున్నారు.
సాధారణంగా వర్షాలు కురిస్తే దుక్కుల్లోనే నారు మడులు వేస్తారు. ఆ తర్వాత ప్రాజెక్టు నీరు విడుదల కాగానే వరినాట్లు వేస్తారు. అదికూడ ఇదే నెలలోనే. కానీ వర్షాలు లేక దుక్కుల్లోనూ తేమలేదు. వరుణుడు కరుణిస్తే తప్ప ప్రాజెక్టు నిండదు. అందులోకి నీరు రాకపోతే ఆయకట్టు భూములు తడవవు. పరిస్థితి ఇలానే ఉంటే సాగునీటి గండం ఏర్పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈసారి వరి సాగు కష్టమంటున్నారు. ఒకవేళ సాగు చేసినా నష్టం తప్పదని పేర్కొంటున్నారు. కడెం ఆయకట్టు రైతులు ఆశగా ఆకాశం వైపు వాన కోసం చూస్తున్నారు. వర్షం కురువాలని పూజలు చేస్తున్నారు. దేవుడు కరుణించి కురిపించాలని వేడుకుంటున్నారు.

