కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) విమర్శించారు. సోమవారం మహబూబ్‌నగర్ పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన కుటుంబాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించిన అనంతరం ఆయన (Srinivas Goud) విలేకరులతో మాట్లాడారు. కూకట్‌పల్లిలో ఒక అమ్మాయిని చంపేసి దొంగతనం చేసారనీ, మాజీ డీజీపీ భార్యను చంపి దొంగతనం చేశారంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతలా దిగజారి పోయాయో అర్థమవుతుందన్నారు.
బాధ్యత కలిగిన కేంద్ర మంత్రి పదవిలో ఉన్న సంజయ్ కొడుకును అదుపులో పెట్టుకోవాల్సింది మర్చిపోయారని శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) ఎద్దేవా చేశారు. ర్యాగింగ్ చేసిన సమయంలోనే కొడుకును హెచ్చరించాల్సిందన్నారు. కొడుకును గాలికి వదిలేయడంతోనే బాలిక జీవితంతో చెలగాటం ఆడి జీవితాన్ని నాశనం చేశారని ధ్వజమెత్తారు. అమ్మాయి కేసు పెడితే పోలీసులు తీసుకోలేదని.. తెలివిగా అమ్మాయి పై వేరే ప్రాంతంలో తమ పలుకుబడితో ఆ బాలికపై కేసులు పెట్టించారని ఆయన ఆరోపించారు.
హిందువులు.. ముస్లింలను రెచ్చగొట్టడం తప్ప బండి సంజయ్ రాష్ట్రానికి చేసిందేమి లేదని, సంజయ్ స్వచ్చందంగా పదవి నుంచి తప్పుకోవాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. కొడుకును చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు సహకరించాలన్నారు. కేసీఆర్, కేటీఆర్ మీద నోరు పారేసుకోవడం.. తప్పుడు ఆరోపణలు చేయడం తప్ప బాధ్యతగా వ్యవహరించాలని బండి సంజయ్ అనుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్టంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై పని చేస్తున్నాయని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. పెట్టుబడులు రావాలంటే క్రైమ్ రేట్ చూస్తున్నారని, ఇలాంటి పరిస్థితులు ఉంటే బయటి నుంచి పెట్టుబడులు రావడం కష్టం అవుతుందన్నారు. శ్రీనివాస్ గౌడ్ వెంట కార్పొరేటర్ కిషోర్ ముదిరాజ్, తదితరులు ఉన్నారు.

