కలం, భువనగిరి: ఓటర్ల జాబితా సవరణ అనేది కేవలం సాంకేతిక ప్రక్రియ కాదని, అది ఓట్ల వడబోత కార్యక్రమమని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) పేర్కొన్నారు. బీఆర్ఎస్ బూత్ స్థాయి ఏజెంట్లు అప్రమత్తంగా ఉండి, అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించేలా చూడాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై భువనగిరి నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక పాలన నడుస్తోందని, అడుగడుగునా రైతులు మోసపోతున్నారని జగదీశ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి జిల్లాలో ఇప్పటికీ ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాలేదని, వర్షాలకు ధాన్యం తడిసి మొలకలు వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
కేసీఆర్ (KCR) గొప్పదనం ఏంటో ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయిందని, తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని ప్రతి ఒక్కరూ అంటున్నారని, వచ్చేది మళ్లీ మన ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజల సొమ్మును దోచుకొని దాచుకుంటున్నారని ఆరోపించారు. హ్యాం రోడ్ల పేరుతో పెద్ద దోపిడీకి స్కెచ్ వేశారని, రూ. 10 ఖర్చుతో చేసే పనిని రూ. 50 చూపిస్తూ వందల కోట్ల రూపాయల కమీషన్లు దొబ్బి తింటున్నారని మండిపడ్డారు. ఈ హ్యాం రోడ్ల విధానం వల్ల భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల రోడ్లపై కూడా టోల్ బూత్‌లు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హ్యాం రోడ్ల పేరిట జరుగుతున్న దోపిడీపై ఖచ్చితంగా విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు.
ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లాలో ఒక్క రూపాయి అభివృద్ధి కూడా జరగడం లేదని జగదీశ్ రెడ్డి విమర్శించారు. “జిల్లాకు చెందిన మంత్రులు పదవులను అనుభవిస్తున్నారు తప్ప, అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదు. ఇద్దరు మంత్రులు పోటీలు పడి మరీ హెలికాప్టర్లు వాడుతున్నారు కానీ, క్షేత్రస్థాయిలో అభివృద్ధి మాత్రం శూన్యం” అంటూ ఎద్దేవా చేశారు. ఈ విస్తృత స్థాయి సమావేశంలో భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, చింతల వెంకటేశ్వర రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ రెడ్డి, యువ నాయకులు సందీప్ రెడ్డిలతో పాటు నియోజకవర్గ మున్సిపల్, మండల, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

