Mobile Popup Ad
Mobile Popup Ad

సింగరేణి ఒకప్పుడు సిరుల గని.. ఇప్పుడు స్కామ్‌ల గని..! : హరీశ్ రావు

కలం, ఖమ్మం బ్యూరో : ఒకప్పుడు సిరుల గనిగా వెలుగొందిన సింగరేణి కాలరీస్ సంస్థ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పూర్తిగా “స్కామ్‌ల గని”గా మారిపోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ముఖ్య నేత హరీశ్ రావు (Harish Rao) తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళవారం కొత్తగూడెంలోని సింగరేణి క్లబ్ లో సంస్థలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి కబంధ హస్తాల నుంచి తెలంగాణకు తలమానికమైన సింగరేణి సంస్థను కాపాడుకోవడమే తమ ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా కార్మిక సంఘాలు, రాజకీయాలకు అతీతంగా సింగరేణి పరిరక్షణపై సమాజంలో విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ​137 ఏళ్ల ఘనమైన చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక వెన్నెముక అని హరీష్ రావు కొనియాడారు. బెల్లంపల్లి నుంచి కొత్తగూడెం వరకు దాదాపు 350 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ సంస్థలో ప్రస్తుతం పర్మనెంట్, కాంట్రాక్ట్ కలిపి 70 వేల మంది కార్మికులు జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. రూ. 37,500 కోట్ల భారీ వార్షిక టర్నోవర్‌ కలిగిన ఈ సంస్థ, దక్షిణ భారతదేశంలోనే బొగ్గు ఉత్పత్తి చేసే ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ అని గుర్తుచేశారు.

ఇక్కడి నుంచే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి పొరుగు రాష్ట్రాలకు కూడా బొగ్గు సరఫరా అవుతుందని, ఇంతటి గొప్ప సంస్థను నాశనం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ​ప్రస్తుత ప్రభుత్వ హయాంలో సింగరేణిలో పదికి పైగా భారీ స్కామ్‌లు నడుస్తున్నాయని హరీశ్ రావు ఆరోపించారు. సంస్థలో సైట్ విజిట్ సర్టిఫికెట్ స్కామ్, సోలార్ పవర్ స్కామ్, జైపూర్ పవర్ స్కామ్, ఎక్స్‌ప్లోజివ్స్ (పేలుడు పదార్థాల) స్కామ్, డీజిల్ స్కామ్‌లతో పాటు దాదాపు 40 లక్షల టన్నుల బొగ్గు మాయం కావడం వంటి అనేక అక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు.

ముఖ్యంగా సింగరేణి చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఓబీ (ఓవర్ బర్డెన్) టెండర్లలో కొత్తగా “సైట్ విజిట్ సర్టిఫికెట్” అనే నిబంధనను తీసుకువచ్చి అక్రమాలకు తెరలేపారని మండిపడ్డారు. గతంలో ఓబీ టెండర్లు ఎప్పుడూ మైనస్ 10 నుండి మైనస్ 20 శాతం తక్కువ ధరలకే కాంట్రాక్టర్లు దక్కించుకునేవారని, ఉదాహరణకు రూ. 1000 కోట్ల విలువైన టెండర్ పనులను రూ. 800 కోట్లకే పోటీపడి చేసేవారని, కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం సింగరేణిలో జరుగుతున్న అక్రమాలపై సీబీఐ తో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>