కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మూసీ ప్రక్షాళన చేపడుతున్న విషయం తెలిసిందే. పేదల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ మూసీ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నది సుందరీకరణ పేరుతో ఇళ్లను కూల్చివేయడాన్ని తప్పుపడుతోంది. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి బీఆర్ఎస్ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ‘మూసీ బస్తీ యాత్ర ప్రోగ్రామ్’కు శ్రీకారం చుట్టింది. రేపట్నుంచే హైదరాబాద్ చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ నుంచి ఈ కార్యక్రమం షురూ కానుంది.
‘‘హైదరాబాద్ (Hyderabad) నగరమంటే హైటెక్ సిటీని చూపిస్తారు. ఆకాశాన్ని తాకినట్టు ఉండే హై రైజ్ బిల్డింగ్‌లను చూపిస్తారు. హైదరాబాద్ అంటే ఇదేనా? అంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తోంది. ‘‘బస్తీలంటే ఈ ప్రభుత్వాలకు చిన్న చూపు. బస్తీల జనాన్ని మనుషుల్లా చూడరు. కనీస జీవన వసతులు ఉండాలని గుర్తించరు. రెక్కాడితే కాని డొక్కాడని బతుకులు. నిలువ నీడ ఉండదు. ఉన్నా, ఎంతకాలం ఉంటుందో తెలువని దైన్య స్థితి. పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టలేని దీన స్థితి. బతుకులు ఎట్లా తెల్లారినా సరే, కనీసం మన పిల్లల భవిష్యత్తయినా బాగుండాలని ప్రతి తల్లితండ్రి కోరుకుంటారు. ఇండ్ల పక్కనే బడా బాబుల బిడ్డలు కార్లలో వెళ్ళి కార్పొరేట్ స్కూళ్ళలో చదువుతుంటే, పిల్లలకు కనీసం నడిచి వెళ్ళినా నాణ్యమైన విద్య అందని పరిస్థితి. పిల్లలు చదివే బడులంటే సర్కారుకు చిన్న చూపు’’ అని ప్రస్తావించింది.
‘‘నగరమంతటా మూడు వేల బస్తీలలో లక్షలాది మంది కష్టజీవులం ఉన్నారు. సమైక్యంగా గర్జిస్తే ప్రభుత్వాలు గడగడలాడుతాయి. అందరం కలుసుకుంటూ ఉందాం. కష్టాలు ఒక్కటే, బతుకులు ఒక్కటే. వాటి పరిష్కారాలు ఏమిటనేది మాట్లాడుకుందాం. కలిసి కట్టుగా కార్యాచరణ చేపడుదాం’’ అని మూసీ బాధితులకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది.

