కలం/ఖమ్మం బ్యూరో : “పదేళ్ల పాటు ప్రజలను గాలికొదిలేసి.. ఇవాళ ఎన్నికలు రాగానే దండాలు పెట్టుకుంటూ వస్తున్న బీఆర్ ఎస్ నాయకులను నమ్మొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti) అన్నారు. ఏదులాపురం మున్సిపల్ (Yedulapuram Municipality) పరిధిలోని 2, 22, 23, 24, 26, 27వ వార్డుల్లో సోమవారం నిర్వహించిన రోడ్ షోల్లో మంత్రి పొంగులేటి పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో సంక్షేమం పేదలకు అందకుండా మోసం చేసిందని తీవ్ర విమర్శలు గుప్పించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి.
బీఆర్ ఎస్ హయాంలో ఫామ్ హౌస్‌కే పరిమితమై, గాలి మోటార్లలో తిరిగిన నాయకులు.. ఈ గల్లీల్లో డ్రైనేజీలు పొంగుతుంటే, ఇళ్లు మునుగుతుంటే ఏనాడైనా కనిపించారా అని మంత్రి పొంగులేటి నిలదీశారు. రాజీవ్ గృహకల్ప వాసులు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోని వారు, ఇవాళ ఎన్నికల కోసం కొత్త నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి పేదవాడికీ రేషన్ కార్డులు ఇచ్చి ఆకలి తీర్చామని, అది కాంగ్రెస్ మార్కు పాలన అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
ముంపు కష్టాలకు ‘రిటైనింగ్’ చెక్..
జూన్ నాటికి కరకట్ట పూర్తి చేసి ముంపు ప్రాంతాల ప్రజల కష్టాలు తీర్చి తీరుతానని మంత్రి వెల్లడించారు. రూ. 690 కోట్లతో నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ ఏదులాపురానికి రక్షణ కవచంలా మారుతుందని, రాజీవ్ గృహకల్ప ఇళ్లకు కొత్త హంగులు అద్దడంతో పాటు ప్రతి ఇంటికీ నల్లా నీరు ఇచ్చే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు. ఇప్పటికే మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో కలిపి సుమారు రూ.308 కోట్లతో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని, ఏదులాపురాన్ని రాష్ట్రానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతానని మంత్రి పేర్కొన్నారు. అభివృద్ధి కావాలంటే హస్తం గుర్తుకే ఓటేయాలని, కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పొంగులేటి (Ponguleti) పిలుపునిచ్చారు.
Read Also: దేశానికి గాంధీ జాతిపిత.. రాష్ట్రానికి కేసీఆర్ : హరీశ్ రావు
Follow Us On : WhatsApp


