కలం డెస్క్ : దాదాపు పది నెలల తర్వాత ఫామ్ హౌజ్ విడిచి బైటకొచ్చిన కేసీఆర్ (KCR) హఠాత్తుగా కృష్ణా నదీ జలాల (Krishna River Water) వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. పదేండ్ల పాటు పాలమూరు (Palamuru Project) జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు అసంపూర్ణంగానే మిగిలిపోయాయి. కాళేశ్వరంమీద చూపిన శ్రద్ధ కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై చూపలేదన్న విమర్శలు వచ్చాయి. ఆ ప్రభావం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కనిపించింది. గతంలో ఈ రెండు జిల్లాల్లోని 26 స్థానాల్లో 22 గెలిచిన బీఆర్ఎస్ (BRS) తాజా ఎన్నికల్లో మూడు సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ జిల్లాల్లో పట్టు సాధించేందుకే ఇప్పుడు కృష్ణా జలాలు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును నెత్తికెత్తుకున్నారనే మాటలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి.
నల్లగొండలో రెండు, పాలమూరులో ఒకటి :
తెలంగాణ ఏర్పడిన కొత్తలో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండలోని 12 స్థానాల్లో ఆరింటిని, మహబూబ్‌నగర్ జిల్లాలోని 14 స్థానాల్లో ఏడింటిని బీఆర్ఎస్(BRS) గెల్చుకున్నది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో తొమ్మిది, మహబూబ్‌నగర్ జిల్లాలో 13 చొప్పున గెల్చుకున్నది. ఈ రెండు జిల్లాల్లో నాలుగు మినహా మిగిలిన స్థానాలన్నీ బీఆర్ఎస్ పార్టీవే. కానీ 2023 ఎన్నికల్లో మాత్రం కేవలం మూడు స్థానాలే గెల్చుకున్నది. ఈ జిల్లాల్లో పట్టు కోల్పోయామని గ్రహించింది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలు పెద్దగా ప్రచారం చేయకపోయినా నాగర్‌కర్నూల్, నారాయణపేట్, కల్వకుర్తి, జడ్చర్ల, కొల్లాపూర్, షాద్‌నగర్ తదితర అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలోనే గెలుపొందడం కేసీఆర్‌కు ఉత్సాహాన్నిచ్చింది.
దక్షిణాది జిల్లాలు చేజారుతున్నాయా?
గతంలో పట్టంకట్టిన నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలు ఇప్పుడు దూరం కావడం బీఆర్ఎస్‌కు మింగుడుపడలేదు. రంగారెడ్డి జిల్లాలోని 14 స్థానాల్లో పదిచోట్ల గెలిచినా అందులో నాలుగు చేజారిపోతాయన్న అంచనాకు వచ్చింది. ఈ మూడు జిల్లాల్లోని యాభై స్థానాల్లో బీఆర్ఎస్ చేతిలో ఉన్నవి తొమ్మిదే. ఒకవైపు పార్టీ బలహీనపడుతూ ఉండడం, ఇంకోవైపు కల్వకుంట్ల కవిత పార్టీని డ్యామేజ్ చేస్తుండడం, ఇదే సమయంలో కాంగ్రెస్ బలపడుతూ ఉండడం కేసీఆర్‌ను ఆందోళనలో పడేసింది. మూడేండ్ల తర్వాత జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టాలనే అంచనాకు వచ్చినట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. దీంతో సెంటిమెంట్‌గా ఉపయోగపడే కృష్ణా జలాల్లో ఏపీ దోపిడీ, సాగునీటి ప్రాజెక్టుల అంశాన్ని ఇప్పటికిప్పుడు టేకప్ చేసినట్లు పేర్కొన్నాయి.
సీఎం రేవంత్‌ను ఢీకొట్టేలా ప్లానింగ్ :
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లా కావడంతో సాగునీటి ప్రాజెక్టుల అంశాన్ని టేకప్ చేసి కాంగ్రెస్‌తో నేరుగా తలపడాలన్నది కేసీఆర్ ఉద్దేశం. ఈ జిల్లాలో కేవలం రెండు స్థానాలను గెల్చుకున్నా అందులో ఒకటి ప్రశ్నార్థకంగా మారింది. కేవలం ఒక్క ఎమ్మెల్యే (విజయుడు) మాత్రమే పార్టీతో ఉన్నారు. ఇంకొకరు (బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి) అంటీ ముట్టనట్లుగానే ఉన్నారు. మరోవైపు నల్లగొండ జిల్లాలో కేవలం సూర్యాపేటను మాత్రమే గెల్చుకున్నది. ఇకపైన ఇది కూడా లేకుండా చేస్తామని కాంగ్రెస్ గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టింది. పరిస్థితిని చక్కదిద్దకుంటే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందనే ఆందోళన బీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతున్నది. భవిష్యత్తులో సిటీలోని స్థానాలు కూడా జారిపోతాయన్నది కేసీఆర్ ఆందోళన. అందుకే పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో సభలు పెట్టి జనాల్లోకి వెళ్ళాలనే ప్లాన్ జరుగుతున్నది.
Read Also: ఢిల్లీలోని బంగ్లా హైకమిషన్ వద్ద హైటెన్షన్ !
Follow Us On: Youtube


