దారుణం.. ఆస్తి కోసం అక్కను హతమార్చిన తమ్ముడు

కలం, సూర్యాపేట : భూ తగాదాలు, ఆస్తి కాంక్ష మానవ సంబంధాలను మంటగలుపుతోంది. ఆస్తి కోసం కన్న అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లనే శత్రువులుగా చూస్తున్న రోజులివి. కేవలం 17 గుంటల భూమి కోసం, తనకు అడ్డు వస్తోందన్న కక్షతో సొంత అక్కను ఓ తమ్ముడు కత్తితో నరికి దారుణంగా హత్య చేసిన ఉదంతం సూర్యాపేట (Suryapet) జిల్లాలో కలకలం రేపింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్నకుమార్ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ సీఐ రాజశేఖర్, ఆత్మకూరు ఎస్ఐ ఐలయ్యలతో కలిసి కేసు వివరాలను వెల్లడించారు.

వివరాల్లోకి వెళితే.. ఆత్మకూర్(ఎస్) మండలం తుమ్మలపెన్‌పహాడ్ గ్రామానికి చెందిన సురభి బుచ్చయ్య, లక్ష్మమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు సంతానం. వీరి చిన్న కూతురు ఉమ వివాహ సమయంలో పసుపు కుంకుమల కింద 2 ఎకరాల 20 గుంటల వ్యవసాయ భూమిని ఇచ్చారు. అయితే, ఉమ పేరున 2 ఎకరాల 3 గుంటల భూమి మాత్రమే రిజిస్ట్రేషన్ కాగా, మిగిలిన 17 గుంటల భూమి రిజిస్ట్రేషన్ కాలేదు. ఈ 17 గుంటల భూమిని ఉమకు రిజిస్ట్రేషన్ చేసే విషయంలో ఉమ కుటుంబానికి, ఆమె అన్న సురభి సైదులు కుటుంబానికి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవల్లో ఉమ పెద్ద అక్క అయిన సురభి అంజమ్మ (మృతురాలు) ఉమకు మద్దతుగా నిలుస్తూ తమ్ముడు సైదులును నిలదీస్తోంది. ఈ క్రమంలోనే 2025 జూలై నెలలో సైదులు, అతని భార్య, కొడుకు కలిసి అంజమ్మ, ఉమలపై దాడి చేయగా ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసు ప్రస్తుతం సూర్యాపేట కోర్టులో పెండింగ్‌లో ఉంది.

అయితే అంజమ్మ, ఉమలను పూర్తిగా అడ్డుతప్పిస్తే ఉమ పేరున ఉన్న భూమితో పాటు మిగిలిన ఆస్తి మొత్తం తమకే దక్కుతుందని సురభి సైదులు, అతని భార్య ధనలక్ష్మి, కొడుకు శివతేజ, బావమరిది కొండ భీమయ్య కలిసి కుట్ర పన్నారు. తమ ప్లాన్‌లో భాగంగా.. ఈనెల 18న (సోమవారం) ఉదయం సుమారు 6 గంటల సమయంలో సురభి అంజమ్మ ఉపాధి హామీ కూలి పనులకు వెళ్తుండగా, తమ్ముడు సురభి సైదులు కత్తితో ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేసి నరికి ఘోరంగా హత్య చేశాడు. ఘటనపై ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదు కాగా, జిల్లా ఎస్పీ నర్సింహ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు బృందావనపురం గ్రామంలో ఉన్న ఏ-4 నిందితుడు కొండ భీమయ్య ఇంట్లో దాక్కున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసు సిబ్బందిని డీఎస్పీ ప్రసన్నకుమార్ ప్రత్యేకంగా అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>