కలం, స్పోర్ట్స్: చెన్నై ఓపెన్‌లో ఓటమి తర్వాత బ్రిటన్ టెన్నిస్ ప్లేయర్ జోడీ బరేజ్ (Jodie Burrage)కు చేదు అనుభవం ఎదురైంది. భారత క్రీడాకారిణి వైష్ణవి అద్కర్ చేతిలో ఓడిపోయిన ఆమెకు సోషల్ మీడియాలో చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని బరేజ్ స్వయంగా వెల్లడించింది. చెన్నై ఓపెన్ తొలి రౌండ్‌లో మంగళవారం వైష్ణవి అద్కర్‌తో బరేజ్ తలపడింది. దాదాపు 2 గంటల 47 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో వైష్ణవి 3-6, 6-3, 7-5తో విజయం సాధించింది. మూడో సెట్‌లో ఒక దశలో 5-3తో ఆధిక్యంలో ఉన్న బరేజ్.. చివరకు మ్యాచ్‌ను కోల్పోయింది.
ఈ ఓటమి తర్వాత ఆమెకు సోషల్ మీడియాలో అసభ్యకర సందేశాలు, హత్య బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆ సందేశాల స్క్రీన్‌షాట్లను బరేజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. 16 నెలల తర్వాత డబ్ల్యూటీఏ సింగిల్స్ ప్రధాన డ్రాలో ఆడిన తనకు ఇలాంటి అనుభవం ఎదురైందని ఆవేదన వ్యక్తం చేసింది.
చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్
బరేజ్‌కు ఎదురైన వేధింపులపై జర్మనీ టెన్నిస్ ప్లేయర్ ఇవా లైస్ స్పందించింది. ఇలాంటి బెదిరింపులకు పాల్పడేవారిపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారని డబ్ల్యూటీఏను ప్రశ్నించింది. బరేజ్‌కు గతంలోనూ ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. 2025 వింబుల్డన్‌లో ఓటమి తర్వాత కూడా సోషల్ మీడియాలో వేధింపులు వచ్చినట్లు ఆమె తెలిపింది. మ్యాచ్‌లపై బెట్టింగ్ పెట్టి డబ్బులు కోల్పోయిన కొందరు వ్యక్తులు ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుంటున్నారని గతంలో అనుమానం వ్యక్తం చేసింది. డబ్ల్యూటీఏ, అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య నివేదిక ప్రకారం.. 2024లో 458 మంది ఆటగాళ్లు ఆన్‌లైన్ వేధింపులకు గురయ్యారు. వీటిలో 40 శాతం నిరాశ చెందిన బెట్టింగ్‌దారుల నుంచి వచ్చినట్లు నివేదిక వెల్లడించింది. ఆటగాళ్లకు సోషల్ మీడియా ద్వారా వచ్చే బెదిరింపులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది.

