కలం, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో ఓ ప్రేమికుల బ్రేకప్ వ్యవహారం సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రియురాలిపై కోపంతో ఓ ఉద్యోగ నియామకానికి సంబంధించిన పేపర్ లీకేజీ (Paper Leak)ని ప్రియుడు బయటపెట్టేశాడు. ఈ వ్యవహారం రాష్ట్రంలో పెను దుమారాన్ని సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రకు చెందిన గౌరవ్ పాటిల్ అనే యువకుడు, రుతుజ అనే యువతి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల మనస్పర్థలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. అయితే ప్రియురాలిపై కోపంతో గౌరవ్ ఓ పెద్ద రహస్యాన్ని బయటపెట్టేశాడు.
ఈ ఏడాది మార్చి 22న ఎంపీఎస్సీ (MPSC) డ్రగ్ ఇన్స్పెక్టర్ (Drug Inspector) పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షలో రుతుజ రాష్ట్ర వ్యాప్తంగా ఏడో ర్యాంక్ సాధించింది. ఈ పరీక్షకు సంబంధించిన పేపర్ ముందే లీక్ అయ్యిందని, రుతుజ కోసం తాను ఆ పేపర్ సంపాదించానని గౌరవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లీక్ అయిన పేపర్ చదివి రుతుజ ఏడో ర్యాంక్ సాధించిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రశ్నా పత్రాన్ని లీక్ చేసింది గౌరవ్ అని పోలీసులు తేల్చారు. దీని కోసం అతడు కొందరు కమిషన్ సిబ్బందికి రూ.5 లక్షలు చెల్లించినట్లు గుర్తించారు. దీంతో గౌరవ్ పాటిల్‌తో పాటు, ఎంపీఎస్సీకి చెందిన సిబ్బంది సహా మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల జరిగిన నీట్, జార్ఖండ్ పేపర్ లీకేజీల తర్వాత ఈ ఘటన వెలుగులోకి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

