కలం, వెబ్ డెస్క్: ప్రాణహిత నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన తుమ్మిడిహట్టి బ్యారేజీ (Thummidihatti Barrage)నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై మహారాష్ట్ర అభ్యంతరాలు లేవనెత్తుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ ఒకటో తేదీన ఢిల్లీలో సమావేశం నిర్వహించబోతుంది. దీనికి ఇరు రాష్ట్రాల సీఎస్, ఇరిగేషన్ అధికారులను ఆహ్వానించింది. ప్రాజెక్ట్ అనుమతులు, అంతర్రాష్ట్ర అంశాలపై కూలంకషంగా చర్చించబోతుంది. బ్యారేజీ నిర్మాణం జరిగేలా చొరవ చూపాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కోరిన నేపథ్యంలో.. ఈ సమావేశం ఏర్పాటు కానుంది.
మహారాష్ట్ర అభ్యంతరం..
ఉమ్మడి ఏపీలో వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడే ప్రాణహిత–చేవెళ్ల పథకానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత నదిపై 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించి, ఎత్తిపోతల ద్వారా జలాశయాలు నింపుతూ చేవెళ్ల వరకు నీటిని తరలించాలనేది ప్రణాళిక. ఈ ప్రాజెక్ట్ కారణంగా మహారాష్ట్రలో వందలాది ఎకరాల భూమి ముంపునకు గురవుతుందని ఆ రాష్ట్రం అభ్యంతరం చెబుతోంది. 148 మీటర్ల వరకు అయితే తాము అంగీకరిస్తామని పేర్కొంది.
అయితే ఈ ఎత్తులో ప్రాజెక్ట్ నిర్మిస్తే.. ప్రాజెక్ట్ లక్ష్యానికి సరిపడా నీటిని తరలించలేమనేది తెలంగాణ ప్రభుత్వం వాదన. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ స్థానంలోనే కాళేశ్వరం నిర్మించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మించేందుకు చర్యలు చేపడుతోంది. దీనిపైనే సెప్టెంబర్ ఒకటో తేదీన కేంద్రం ఆధ్వర్యంలో చర్చలు జరగబోతున్నాయి.

