కలం, మహబూబ్ నగర్ బ్యూరో : విత్తనోత్పత్తిని వ్యాపార కార్యక్రమంగా రైతాంగం చేపట్టి ఆర్థికంగా ఎదగాలని గ్వాలియర్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్లర్ ఎస్కే. రావు పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్ఏయూ) ఆధ్వర్యంలో ప్రాథమిక సహకార సంఘాల ద్వారా విత్తనోత్పత్తిని వ్యాపార కార్యకలాపంగా చేపట్టడం, ప్రాజెక్టు అమలు కార్యక్రమాలపై అవగాహన అనే అంశంపై అవగాహన సదస్సు గురువారం మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి గ్వాలియర్ యూనివర్సిటీ మాజీ వైస్‌చాన్స్‌లర్ ఎస్.కె. రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. నాణ్యమైన విత్తనం పంటల దిగుబడి పెంపుతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. PACSలు విత్తనోత్పత్తిని స్థిరమైన, లాభదాయకమైన వ్యాపార కార్యకలాపంగా చేపట్టేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, శాస్త్రవేత్తలు, రైతులతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయ ప్రాజెక్టు ప్రధాన పరిశోధకులు విత్తనాల డైరెక్టర్ డా.ఎం.వి. నాగేష్ ప్రాజెక్టు లక్ష్యాలను వివరించారు. సహకార సంఘాల ద్వారా నాణ్యమైన విత్తనోత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాలని, విత్తన ఎంపిక, శాస్త్రీయ సాగు పద్ధతులు, నాణ్యత నియంత్రణ, ప్రాసెసింగ్, నిల్వ సకాలంలో విత్తనాల పంపిణీ వంటి అంశాలను వివరించారు.
ప్రాజెక్టు మేనేజర్ డా. విద్యాధర్ ప్రాజెక్టు అమలు కార్యక్రమాలు, సహకార సంఘాల బాధ్యతలు, వివిధ శాఖల మధ్య సమన్వయం గురించి వివరించారు. ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం, నాబార్డ్, సహకార శాఖ, ప్రాథమిక సహకార సంఘాలు, రైతుల సమన్వయంతో ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేయాలని సూచించారు.
రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ పాలెం ఏడిఆర్ కృష్ణ విత్తనోత్పత్తిలో శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం, నిపుణుల సాంకేతిక సూచనల ప్రాధాన్యతను వివరించారు. విత్తనోత్పత్తి వివిధ దశల్లో సహకార సంఘాలు, రైతులకు ఆర్‌ఏఆర్‌ఎస్, జయశంకర్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి మహబూబ్‌నగర్ సీఈవో మహ్మద్ షఫీ ఉల్లా ఖాన్, నాబార్డ్ మహబూబ్‌నగర్ డీడీఎం షణ్ముఖ చారి, నాబార్డ్ నారాయణపేట డీడీఎం మహేందర్, మహబూబ్‌నగర్ జిల్లా సహకార అధికారి కృష్ణ, నాగర్ కర్నూల్ , వనపర్తి జిల్లాల డీసీఓ లతో పాటు రఘునాథరావు తదితరులు పాల్గొన్నారు.

