ధోనీ వాటా వార్తలపై ఆకాశ్ చోప్రా ఫైర్.. అవన్నీ ఫేక్ స్టోరీలే!

కలం, స్పోర్ట్స్‌: ఎంఎస్‌ ధోనీ (MS Dhoni), చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్‌ 2026లో ధోనీ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడకపోయినా.. సీఎస్‌కేకు ఆయన ప్రాధాన్యతపై చర్చ కొనసాగింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ 2027 రిటెన్షన్‌ తేదీలకు ముందు ధోనీకి సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. క్రిక్‌బ్లాగర్‌ కథనం ప్రకారం.. ధోనీ సీఎస్‌కేలో మొదట 25 శాతం వాటాను కోరారని, ఆ తర్వాత దాన్ని 20 శాతానికి తగ్గించారని ప్రచారం జరిగింది. చివరికి ఫ్రాంచైజీ ఆయనకు 5.5 శాతం వాటాను ఆఫర్‌ చేసిందని ఆ కథనం పేర్కొంది. ఈ వార్తలపై మాజీ భారత క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా(Aakash Chopra) స్పందించారు. ఈ ప్రచారంలో వాస్తవం లేదని, ఇది కావాలని వండివార్చిన కథనంలా అనిపిస్తోందని అన్నారు. తన యూట్యూబ్‌ ఛానెల్‌లో మాట్లాడిన ఆయన సీఎస్‌కే బ్రాండ్‌ విలువను ప్రస్తావించారు.

ఇటీవల ఆర్సీబీ ఫ్రాంచైజీ విలువ 1.7 నుంచి 1.8 బిలియన్‌ డాలర్లుగా ఉందని ఆకాశ్‌ చోప్రా తెలిపారు. ఐదు ఐపీఎల్‌ టైటిళ్లు గెలిచిన సీఎస్‌కే విలువ కూడా అదే స్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు. 1.8 బిలియన్‌ డాలర్ల విలువైన ఫ్రాంచైజీలో 25 శాతం వాటా అంటే సుమారు 400 మిలియన్‌ డాలర్లని వివరించారు. ఐపీఎల్‌ ఫ్రాంచైజీలో ఇంత భారీ వాటాను ఎవరూ ఉచితంగా ఇవ్వబోరని చోప్రా స్పష్టం చేశారు.

వాటా కావాలంటే సుమారు 400 మిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని అన్నారు. చివరికి 5.5 శాతం వాటా ఇవ్వడం కూడా చిన్న విషయం కాదని అభిప్రాయపడ్డారు. రెండు, మూడు లేదా ఐదు శాతం వాటా కూడా వందల మిలియన్ల విలువ చేస్తుందని తెలిపారు. ధోనీ 25 శాతం వాటా అడగడం, దాన్ని తిరస్కరించడం, ఆపై 5.5 శాతానికి ఒప్పందం కుదరడం వంటి ప్రచారాలు నమ్మశక్యంగా లేవని ఆకాశ్‌ చోప్రా అన్నారు. తన వద్ద ఆధారాలు లేనందున దాన్ని ఫేక్‌ న్యూస్‌ అని చెప్పలేనని, అయితే ఇది నిజమైన కథనం కాదని తనకు అనిపిస్తోందని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>