కలం, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట (Masaipet) గ్రామంలో సురమాంబ సమేత కంఠమహేశ్వరస్వామి దేవాలయంలో బోనాల పండుగను శనివారం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. సాయంత్రం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. మహిళలు కొత్త మట్టి కుండలలో బెల్లం, పాలు, పెరుగు, అన్నంతో తయారుచేసిన బోనాన్ని తలపై ఎత్తుకుని, వేపాకులు, పసుపు, కుంకుమతో అలంకరించి డప్పు వాయిద్యాల నడుమ కాటమయ్య ఆలయానికి తరలివచ్చారు.
బోనం ఎత్తుకున్న మహిళల పాదాలకు నీళ్లు పోసి గ్రామస్థులు స్వాగతం పలికారు. పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లతో గ్రామం మారుమోగింది. బోనాల సందర్భంగా శివపార్వతులకు ప్రత్యేక పూజలు జరిగాయి. పంటలు బాగా పండాలని, గ్రామంలో ఎలాంటి అంటురోగాలు రాకుండా కాపాడాలని వేడుకున్నారు. సర్పంచి కళ్లెం జహంగీర్ గౌడ్, గౌడ సంఘం అధ్యక్షుడు గొట్టిపర్తి బాలరాజు గౌడ్,ఉపేందర్ గౌడ్, గౌడ కులస్థులు తదితరులు ఉన్నారు.

