భద్రాద్రి పాలిటిక్స్‌లో బిగ్ బ్లాస్ట్.. తెల్లంకు పీఏ సెగ, ‘రేగా vs పాయం’ రచ్చ!

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి (Bhadradri) మన్యం రాజకీయం ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠను, ఆందోళనను రేపుతోంది. ఒకవైపు భద్రాచలం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నమ్మకమైన పీఏ చేసిన కోట్ల రూపాయల ఉద్యోగాల మోసం రాజకీయంగా పెద్ద గందరగోళానికి దారితీయగా, మరోవైపు పినపాకలో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, ప్రస్తుత ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయం ఒక్కసారిగా అగ్నిగుండంలా మారింది. జిల్లా వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ రెండు ఘట్టాలు ఇప్పుడు మన్యం వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

​భద్రాచలం శాసనసభ్యుడు తెల్లం వెంకట్రావుకు ఆయన వ్యక్తిగత సహాయకుడి (పీఏ) వ్యవహారం రాత్రికి రాత్రే తీవ్ర తలనొప్పిగా పరిణమించింది. రెవెన్యూ శాఖకు చెందిన కళ్యాణ్ అనే ఉద్యోగి రెండున్నర ఏళ్ల క్రితం ఎమ్మెల్యే వద్ద పీఏగా చేరారు. అయితే, ఆయన ఎమ్మెల్యే పేరును అడ్డుపెట్టుకుని సాగించిన దందా ఇప్పుడు బట్టబయలైంది. మణుగూరు విద్యుత్ ప్లాంట్‌తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మించి, ఒక్కొక్కరి నుంచి రూ. 5 లక్షల నుండి రూ. 25 లక్షల వరకు వసూలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మోసపోయిన ఒక బ్యాంకు ఉద్యోగి సదరు పీఏ ఖాతాను పరిశీలించగా అందులో దాదాపు రూ. 8 కోట్ల మేర లావాదేవీలు ఉన్నట్లు బయటపడటం స్థానికంగా కలకలం రేపింది. పలువురికి నకిలీ కాల్ లెటర్లు ఇవ్వడమే కాకుండా, చివరికి ఎమ్మెల్యే సొంత బంధువులను కూడా ఉద్యోగాల పేరిట ముంచేసినట్లు ప్రచారం జరుగుతోంది.

అంతేకాకుండా, పలువురు ప్రభుత్వ ఉద్యోగులతో షూరిటీలు ఇప్పించి చిట్టీలు పాడి, ఈఎంఐలు కట్టకపోవడంతో ఇప్పుడు ఆ ఉద్యోగులకు బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయి. బాధితుల నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో పీఏ కళ్యాణ్ ప్రస్తుతం పరారీలో ఉన్నప్పటికీ, నిత్యం బాధితులు ఎమ్మెల్యే ఇంటి ముందే నిలదీస్తుండటంతో తెల్లం వెంకట్రావు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. వివాదం ముదరడంతో పీఏను సరెండర్ చేస్తూ ఎమ్మెల్యే ప్రభుత్వానికి లేఖ రాసినప్పటికీ, గతంలోనూ ఒక అనధికారిక పీఏ ఇసుక ర్యాంపుల పేరిట చేసిన మోసాలు గుర్తుచేసుకుంటున్న స్థానికులు, ఈ కోట్ల రూపాయల దందాతో ఎమ్మెల్యే రాజకీయ భవిష్యత్తే ప్రమాదంలో పడిందని అభిప్రాయపడుతున్నారు.

​ఈ రచ్చ ఇలా ఉండగానే, పినపాక నియోజకవర్గంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం సరికొత్త మలుపు తిరిగింది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మధ్య ఆస్తుల వివాదాలు, వ్యక్తిగత విమర్శలు పీక్స్‌కు చేరాయి. ఇటీవల తనపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేయడంతో నియోజకవర్గానికి భారీ ర్యాలీగా చేరుకున్న రేగా కాంతారావు, కాంగ్రెస్ ప్రభుత్వం తనపై కావాలనే కుట్రపూరితంగా తప్పుడు కేసులు పెట్టిందని మండిపడ్డారు. ఇదే సమయంలో తనపై 5,000 ఎకరాల అక్రమ ఆస్తులు ఉన్నాయంటూ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ, అక్రమ ఆస్తులు ఉన్నట్లు నిరూపిస్తే అంబేద్కర్, కొమురం భీం సాక్షిగా పేదలకు పంచుతానని, మరి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తన ఆస్తులను పంచడానికి సిద్ధమా అని బహిరంగ సవాల్ విసిరారు.

​రేగా విసిరిన సవాల్‌పై హైదరాబాద్ నుంచి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళను వేధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పినపాకలో ఏ ముఖం పెట్టుకుని తిరుగుతారని ప్రశ్నిస్తూ, రేగాకు నిజంగానే నిజాయితీ ఉంటే హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముందు ర్యాలీ నిర్వహించి తన పవిత్రతను నిరూపించుకోవాలని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. మణుగూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. ఇద్దరు నేతల మధ్య ప్రారంభమైన ఈ మాటల యుద్ధంతో స్థానిక నాయకులు, కార్యకర్తలు కూడా రంగంలోకి దిగడంతో పినపాక రాజకీయ వాతావరణం మరింత రసవత్తరంగా మారింది.

​మొత్తానికి భద్రాద్రి జిల్లాలో ఒకవైపు అధికార దుర్వినియోగం, పీఏల దందాలు ప్రజాప్రతినిధుల విశ్వసనీయతను దెబ్బతీస్తుంటే, మరోవైపు పినపాకలో ప్రజా సమస్యల కంటే వ్యక్తిగత విమర్శలే ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాబోయే రోజుల్లో పీఏ కళ్యాణ్ మోసంపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో, అలాగే పినపాకలో చోటుచేసుకుంటున్న ఈ పొలిటికల్ వార్ ఎటు దారితీస్తుందోనని జిల్లా ప్రజలు, రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>